Hydra Demolition : ఏడాది ముగింపులోనూ హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. తన పరిధిలో చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే.. నిబంధనలు, అనుమతులు అంటూ కాలయాపన చేయకుండా ప్రజా ఆస్తుల్ని, ప్రకృతి వనరుల్ని కాపాడుకునేందుకు తక్షణమే రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలోనే హైడ్రా తాజాగా శేరిలింగం పల్లిలో అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టింది. ఇక్కడి భగీరథమ్మ, తౌతానికుంట చెరువుల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను పంపింది.
హైదరాబాద్ నగర నిర్మాణం, అభివృద్ధితో పాటు ఇక్కడ ప్రకృతి సంపదల్ని.. తరాల పాటు ప్రజల అవసరాల్ని కాపాడేలా చేపట్టిన చర్యల్లో హైడ్రాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. విశేష అధికారాలు, ప్రభుత్వ పూర్తి అండదండలతో తమపర భేదం లేకుండా.. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ హైడ్రా ప్రత్యక్షమవుతోంది. తనకు కేటాయించిన బాధ్యతల్ని తూ.చా తప్పకుండా ఎలాంటి రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు లొంగకూండా పనిచేసుకుంటూ పోతుంది. అందులో భాగంగా.. కొత్త ఏడాది వేడుకలకు ముందు సైతం తన పవర్ చూపిస్తోంది. చెరువులు, కుంటల జోలికి వస్తే ఊరుకునేది లేదని తేల్చి చెబుతోంది.
శేరిలింగంపల్లి మండలంలో పరిధిలోని ఖాజాగూడ – నానక్ రామ్ గూడ ప్రధాన రహదారికి ఇరువైపులా భగీరథమ్మ, తౌతానికుంట చెరువులు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఊహించని రీతిలో పుంజుకుని పరుగులు తీస్తోంది. అందుకే.. అక్రమార్కుల కళ్లు.. ఈ చెరువులపై పడ్డాయి. దాంతో.. రేకులతో ఆ స్థలాలను తమవిగా చెప్పుకుండా అడ్డుగోడ కట్టేశారు. దాంతో.. రంగంలోకి దిగిన హైడ్రా వెంటనే కూల్చివేతలు చేపట్టింది.
ఈ చెరువుల భూముల్ని అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని.. స్థానికులు ఫిర్యాదుల చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతవారంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఫిర్యాదు అందిన ప్రాంతంలో చెరువుల భూముల్లోనే నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించారు. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లలో ఆక్రమణలు జరిగినట్టు అధికారులు నిర్థరించారు. దాంతో.. రంగంలోకి దిగిన హైడ్రా మంగళవారం నాడు కూల్చివేతలు చేపట్టింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో ప్రొక్లేన్ సాయంతో అక్కడి చేరుకున్న ప్రభుత్వ సిబ్బంది.. 10 ఆక్రమణలను కూల్చివేశారు. రేకుల షెడ్డలతో పాటు రేకుల ప్రహరీ నిర్మించి ఆక్రమణలు చేసినట్టు గుర్తించిన అధికారులు.. వాటిని పూర్తిగా కూల్చివేశారు. నోటీసులు అందజేసిన తర్వాత కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు.. కూల్చివేతలతో 10 ఎకరాల వరకు ప్రభుత్వ, చెరువు భూముల స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
ఈ కేసులో అక్రమణలకు పాల్పడిన వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. అక్రమణలపై నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజల నుంచి స్వచ్ఛందా అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే కూల్చివేతలకు పాల్పడుతున్నారు. పక్కా సమాచారం, సాంకేతిక ఆధారాలను దగ్గర పెట్టుకుని కూల్చివేతలు చేపడుతున్నారు. నూతన ఏడాది వేడుకలకు ముందు హైడ్రా దూకుడుతో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటల్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన వారికి కంటి మీద కునుకు ఉండడం లేదు.
Also Read : ఫార్ములా ఈ-రేస్ కేసులో వాదోప వాదనలు.. ఆపై లంచ్ బ్రేక్
ప్రారంభంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో హైడ్రా మరింత దూకుడుగా ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పట్టుదల, చెరువుల్ని రక్షించాలనే సంకల్పంతో.. అక్రమార్కులపై మరిన్న చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. అలాగే.. త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్లు సైతం రానుండడంతో హైడ్రాకు ప్రత్యేక అధికారాలు రానున్నాయి.