Hydra Demolition: ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటోంది హైడ్రా. ప్రభుత్వ భూములకు రక్షణ, చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతుంది. ఇప్పటివరకు చెరువులు, కుంటల FTL, బఫర్ జోన్లలో వెలసిన అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేసిన హైడ్రా.. తాజాగా మహానగరంలోని అక్రమ నిర్మాణాలపై కూడా ఫోకస్ చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ మాదాపూర్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనం కూల్చివేత ప్రారంభమైంది. బిల్డింగ్ కూల్చివేతకు హైడ్రా రప్పించిన మెషిన్ పని ప్రారంభించింది.
అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా 8 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే పలు మార్లు అధికారులు హెచ్చరించినా బిల్డర్ పట్టించుకోలేదు. స్థానికుల ఫిర్యాదుతో ఫీల్డ్ విజిట్ చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. అనుమతులు లేవని తేలడంతో కూల్చివేతకు ఆదేశించారు. దీంతో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్నారు.
శేరి లింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో ఉన్న 684 గజాల స్థలంలో 8 అంతస్తుల భవనం సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. అయ్యప్ప సొసైటీకి చెందిన ఈ భవనం ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్టు హైడ్రాకు పలువురు ఫిర్యాదులు అందించారు. ఈ క్రమంలో సైట్ విజిట్ చేసిన హైడ్రా అధికారులు.. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు.
ఈ క్రమంలో ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో GHMC అధికారులు ఓ సారి కూల్చివేశారు కూడా.. అయినప్పటికీ.. అధికారుల హెచ్చరికలు, కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా మళ్ళీ నిర్మాణాలు మొదలు పెట్టారు బిల్డర్స్. ఈ విషయం గుర్తించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం కూల్చివేతకు ఆదేశించారు. ఈ క్రమంలో ఇవాళ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయ్యప్ప సొసైటీ బిల్డింగ్ వద్దకు ఇప్పటికే చేరుకున్నారు. కూల్చివేతలు చేపట్టేందుకు హైడ్రాతో పాటు GHMC, DRF బృందాలు సిద్ధమయ్యాయి.
Also Read: కేవలం ప్రోత్సాహం మాత్రమే.. సివిల్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీలో సీఎం రేవంత్
హైడ్రా యాక్షన్‌తో రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ను లేక్ సిటీగా మార్చడం గ్యారంటీ అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్ నగరంలోని చెరువులను మంచినీటి చెరువులుగా కూడా మార్చనుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై.. ప్రతి సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేశారు. రేపటి నుంచి నుంచి హైడ్రా హెడ్ ఆఫీస్ బుద్ధ భవన్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలిసారిగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించనున్నారు. ఫిర్యాదుదారులను నేరుగా ఆహ్వానించి.. వారి నుంచి కంప్లైంట్లు తీసుకోనున్నారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, నాలాలు, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడటంతో పాటు.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు అండగా నిలిచేందుకు.. హైడ్రాను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు ఒకరోజు కేటాయించాలని భావించిన హైడ్రా అధికారులు.. ప్రతి సోమవారం కంప్లైంట్లు తీసుకోనున్నారు.