HYDRAA: పార్కుల ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూరు విలేజ్‌లోని మంజీరా కాలనీలో ఆక్రమణకు గురైన 577 గజాల పార్కును హైడ్రా కాపాడింది. గ్రామపంచాయతీ లేఔట్‌లో పార్కుగా చూపించిన స్థలాన్ని తిరిగి ప్లాట్లుగా విక్రయించేశారు. అక్కడ ప్లాట్లు కొన్న వారు ప్రహరీ నిర్మించి నిర్మాణానికి సిద్ధమవుతుండగా, మంజీరా కాలనీ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో పిర్యాదు చేశారు. స్థానిక మున్సిపల్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని హైడ్రా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, లే ఔట్ ప్రకారం పార్కుగా హైడ్రా నిర్ధారించింది. మంగళవారం ఈ మేరకు అక్కడ నిర్మించిన ప్రహరీలను తొలగించి పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. అలాగే మున్ముందు ఆక్రమణలు రాకుండా పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసింది.
మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్లలోని శ్రీ లక్ష్మీనగర్ కాలనీలో ప్రజావసరాలతో పాటు పార్కు కోసం కేటాయించిన 639 చదరపు గజాల పార్కు స్థలాన్ని కూడా హైడ్రా పరిరక్షించింది. ఈ స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించేయగా, కొన్న వారు ప్రికాస్ట్ వాల్స్ నిర్మించారు. ఇదే విషయాన్ని హైడ్రా ప్రజావాణిలో అక్కడి స్థానికులు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్లు 33/3, 33/4లోని గ్రామ పంచాయతీ లే ఔట్‌లో మొత్తం 67 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. లేఅవుట్‌లో రోడ్లు, నివాస భవనాలు ఇప్పటికే రాగా, కొన్ని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ అనుమతులు కూడా వచ్చాయి. గ్రామ పంచాయతీ లేఔట్ ప్రకారం ప్లాట్ నెంబర్లు 37, 38, 39లను పార్కుతో పాటు ప్రజాప్రయోజనాల కోసం కేటాయించినట్లు అధికారులు నిర్ధారించారు. మంగళవారం ఈ మేరకు హైడ్రా రంగంలోకి దిగి, ప్రహరీలను తొలగించింది. 639 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. పార్కుతో పాటు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు కూడా ఏర్పాటు చేసింది.
అక్రమ బోర్లపై కూడా హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లాపూర్‌లో మంగళవారం కూడా హైడ్రా దాడులు నిర్వహించి 3 బోర్లతో పాటు 3 సంపులను హైడ్రా తొలగించింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం, తెల్లాపూర్ విలేజ్‌లో 7 బోర్లు, 6 వాటర్ సంపులను తొలగించిన విషయం విధితమే. మంగళవారం కూడా ఆ ప్రాంతంలోనే తనిఖీలు ముమ్మరం చేసి మరో 3 బోర్లు, 3 సంపులను హైడ్రా తొలగించింది. అక్రమ బోర్లపై వస్తున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తొలగించే కార్యక్రమాన్ని హైడ్రా కొనసాగిస్తోంది.
Also read: కొడంగల్ మహిళకు విముక్తి.. కేటీఆర్ చొరవతో మస్కట్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన లక్ష్మి!