HYDRAA: ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భరత్‌నగర్ – ఖైతలాపూర్ – హైటెక్ సిటీ రోడ్డుకు ఎడమవైపు ఉన్న కాముని చెరువు మురుగు నీటితో దుర్గంధభరితంగా మారడంతో గుర్రపు డెక్క వ్యాపించి దోమల బెడదతో రోగాలభారిన పడుతున్నామని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించి చెరువును అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్‌ను కోరారు.
గ్రేవ్‌యార్డ్ స్థలవివాదాన్ని పరిశీలించిన కమిషనర్
చెరువు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లను పరిశీలించి.. వెంటనే ఈ చెరువు అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. అలాగే జలమండలికి – స్థానికంగా ఉన్న ముస్లింలకు మధ్య ఉన్న గ్రేవ్‌యార్డు స్థలవివాదాన్ని కూడా కమిషనర్ పరిశీలించారు. ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి వివరాలు తెలుసుకుంటామని.. తర్వాత గ్రేవ్‌యార్డు సమస్య పరిష్కరిస్తామని హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా వారికి తెలిపారు.
హైడ్రా అధికారులకు కమిషనర్ ఆదేశం
ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉందో తెలుసుకుని ఆ మేరకు ఫెన్సింగ్ వేయాలని హైడ్రా అధికారులను కమిషనర్ ఆదేశించారు. తర్వాత కూకట్‌పల్లి, శంషిగూడ లోని శిల్పా బృందావన్ కాలనీ హెచ్ ఎండీఏ లే ఔట్‌ను మార్చేసి.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని లే ఔట్ వేస్తున్నారనే ఫిర్యాదును కూడా హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక్కడ ప్రభుత్వ భూమి వివరాలు తెలుసుకుని ఆ మేరకు ఫెన్సింగ్ వేయాలని సూచించారు.
తుర్క చెరువునూ అభివృద్ధి చేస్తాం..
నిజాంపేటలోని బండారీ లేఔట్‌కు ఆనుకుని ఉన్న తుర్క చెరువును కూడా హైడ్రా అభివృద్ధి చేస్తోందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ అక్కడి స్థానికులకు వివరించారు. చెరువులోకి మురికి నీరు చేరి పరిసరాలన్నీ దుర్గంధభరితంగా.. దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. 43.50 ఎకరాల చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.
మురుగు నీరు కలవకుండా ఎస్‌టీపీలు ఏర్పాటు
ముందుగా మురుగునీరును బయటకు పంపి.. పూడికను తొలగించిన తర్వాత చెరువు సుందరీకరణ పనులు చేపడతామన్నారు. మురుగు నీరు కలవకుండా ఎస్‌టీపీలను ఏర్పాటు చేసి.. చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, ప్లేఏరియాలు, పార్కులు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే కూకట్‌పల్లి నుంచి జీడిమెట్ల వెళ్లే ఉషాముల్లపూడి రోడ్డులో ఉన్న ఎల్లమ్మ కుంట అభివృద్ధికి కూడా సహకరిస్తామని తెలిపారు. చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎస్ ఆర్ నిధులతో పనులు చేపట్టిన భవ్య కనస్ట్రక్షన్స్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఈ చెరువు ఎఫ్టీఎల్ హద్దులను నిర్ధారిస్తామని.. వెంటనే ఈ పనులు చేపట్టాలన్నారు.
హైడ్రా కమిషనర్‌కు ఘన స్వాగతం
ప్రగతినగర్ చెరువు చెంత చేపలు, మాంసం దుకాణాల తరలింపును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. త్వరలోనే ఈ చెరువు అభివృద్ధి పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా స్థానికులకు చెప్పారు. పలు కాలనీ వాసులు, కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌కు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. చెరువుల అభివృద్ధితో పాటు.. పార్కులను, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతున్నారంటూ శాలువతో సన్మానించారు.
Also Read: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 1.07 కోట్ల మోసం.. ఢిల్లీకి చెందిన నిందితుడు అరెస్ట్