Hydraa demolish: హైడ్రా దూకుడు మళ్లీ మొదలైందా? కూల్చివేతలు జరుగుతున్నా, కబ్జాదారులు వెనక్కి తగ్గలేదా? ప్రజల ఫిర్యాదులతో స్పీడ్ పెంచిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. చెరువులు రక్షించేందుకు రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా తీసుకొచ్చింది హైడ్రా.
తొలుత హైడ్రాపై విమర్శలు వచ్చినా తర్వాత ప్రజల్లో చైతన్యం మొదలైంది. దేశంలోని అన్ని నగరాల కంటే హైదరాబాద్ సేఫ్ అన్న మాటలతో ఏకీభవించారు ప్రజలు. ఈ క్రమంలో కబ్జాలపై నేరుగా ఫిర్యాదు చేయడం, అధికారులు పరిశీలించిన తర్వాత నోటీసులు ఇవ్వడం జరుగుతోంది. అప్పటికే వినకుంటే కూల్చివేతలకు దిగుతున్నారు.
లేటెస్ట్‌గా మేడ్చల్‌లోని జవహర్ నగర్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు కొందరు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
ప్రభుత్వ స్థలం సర్వే 25, 15 ల్లో భూములు కబ్జాకు గురైనట్టు గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. బీఆర్ఎస్ నేతకు చెందినది ఈ ఫంక్షన్ హాలు. అందులోని వస్తువులు బయటపెట్టిన తర్వాత జేసీబీల సాయంతో పడగొడుతున్నారు. పక్కనే ఉన్న మరో ప్రభుత్వ స్థలంలో దోబి ఘాట్‌ను కబ్జా చేశారు. దాన్ని కూడా కూల్చివేస్తోంది హైడ్రా.
ALSO READ: లగచర్ల దాడి కేసు.. కీలక రహస్యాలు ఐఫోన్‌లో..
అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు తమకు ఫిర్యాదు వస్తే పరిశీలించిన తర్వాత వాటిని కూల్చివేస్తామని పదేపదే కమిషనర్ రంగనాథ్ చెబుతున్నారు. మరోవైపు ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు జనవరి నుంచి వారంలో ఒక రోజు ప్రజావాణి మాదిరిగా హైడ్రా కోసం ఒక రోజు కేటాయించనున్నారు. మొత్తానికి హైదరాబాద్ నగర పరిధిలో కబ్జా మురికి వదిలించనున్నారన్న మాట.