Pakistan Honeytrap: స్వేచ్ఛ బ్యూరో: పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ విసిరిన హనీట్రాప్ లో చిక్కుకున్న భారత వైమానిక దళ వింగ్ కమాండర్ ఒకరు అత్యంత కీలకమైన రక్షణ సమాచారాన్ని లీక్ చేశాడు. గమనించాల్సిన అంశం ఏమిటంటే సదరు ఏజెంట్ పంపించిన ఒక్కో నగ్న ఫోటోకు బదులుగా అత్యంత రహస్యంగా పెట్టాల్సిన యుద్ధ ప్రణాళికలకు సవంబంధించి ఒక్కో పేజీని పంపించటం. 44ఏళ్ల వయసున్న సదరు అధికారిని అరెస్ట్ చేసిన అధికారులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఈ సంచలన వివరాలను వెల్లడించారు.
సోషల్ మీడియా ద్వారా..
వైమానిక దళంలో వింగ్ కమాండర్ గా పనిచేస్తున్న ఓ అధికారికి పాక్ నిఘా ఏజెంట్ సోషల్ మీడియా ద్వారా గత జనవరిలో హనీట్రాప్ లోకి లాగింది. అప్పటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు వీరి మధ్య వందలాది వాట్సాప్ మెసేజీలు, ఫోటోలు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ నడిచాయి. కాగా, మే నెలలో సదరు అధికారి తన స్మార్ట్ ఫోన్ ను ఆఫీస్ లోకి తీసుకెళుతుండగా తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది దానిని స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ లోని వివరాలను విశ్లేషించగా హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు వైమానిక దళ అధికారుల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి తీహార్ జైలుకు రిమాండ్ చేశారు.
వేలాది టెక్ట్స్ మెసేజీలు..
దర్యాప్తులో జనవరి 12నుంచి ఏప్రిల్ 1వ తేదీ మధ్య సదరు వింగ్ కమాండర్..పాకిస్తానీ ఏజెంట్ మధ్య వాట్సాప్ లో 3వేలకు పైగా మెసేజీలు ఎక్స్ ఛేంజ్ అయినట్టుగా నిర్ధారణ అయ్యింది. దాంతోపాటు 65ఫోటోలు, 42వాయిస్ కాల్స్, 4వీడియో కాల్స్ జరిగినట్టుగా తేలింది.
నగ్న ఫోటోలకు..
పాకిస్తాన్ ఏజెంట్ పంపించిన నగ్న ఫోటోలకు బదులుగా, వింగ్ కమాండర్ రహస్య యుద్ధ ప్రణాళికల్లోని ఒక్కో పేజీని అప్ లోడ్ చేసినట్టుగా వెల్లడైంది. పంపించే ప్రతి నగ్న ఫోటోకు యుద్ధ ప్రణాళికలోని కొత్త పేజీని ఇస్తానని వింగ్ కమాండర్ స్వయంగా ఆఫర్ చేసినట్టు దర్యాప్తు అధికారులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
లీక్ అయిన కీలక సమాచారం..
వింగ్ కమాండర్ పాకిస్తాన్ ఏజెంట్ కు చేరవేసిన సమాచారంలో ఓ రహస్య డ్రోన్ విభాగం బలం, దాని నిర్మాణం, డ్రోన్ పరీక్షల ఫలితాలు, ఆయుధ సామర్థ్యం, యుద్ధ సమయాల్లో వాటిని మోహరించే ప్రాంతాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. దాంతోపాటు లేహ్ ప్రాంతంలో మోహరించిన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌ల వివరాలు, ఫ్రంట్‌లైన్ యుద్ధ విమానాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని కూడా వింగ్ కమాండర్ లీక్ చేశాడు. రాజస్థాన్ సూరత్‌ఘఢ్ సమీపంలోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో జరిగిన సైనిక విన్యాసాల వివరాలు, సున్నితమైన సైనిక స్థావరాల కోఆర్డినేట్‌లను పాక్ ఏజెంట్ తో పంచుకున్నాడు. పాకిస్తాన్ ఏజెంట్ సూచనల మేరకు తన కింద పనిచేస్తున్న ఐదుగురు సిబ్బంది అధికారిక డివైజ్ లలో మాల్వేర్ (స్పైవేర్) యాప్ లను ఇన్‌స్టాల్ చేసినట్టు అధికారులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
Also Read: బిగ్ టీవీ ఎఫెక్ట్.. మెట్రో పిల్లర్ల వద్ద అక్రమ తవ్వకాలపై HMRL కొరడా.. 15 రోజుల డెడ్‌లైన్!