
IT Raids : తెలంగాణలో మరోసారి ఐటీ దాడుల కలకలం రేగింది. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి వచ్చిన రెండ్రోజుల వ్యవధిలోనే రాజకీయ నేతల ఇళ్లపై, వివిధ సంస్థలపై ఐటీ దాడులు జరగడం గమనార్హం. గురువారం తెల్లవారుజాము నుంచీ హైదరాబాద్ తో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. 60 వాహనాల్లో ఆయా ప్రాంతాలకు వెళ్లిన ఐటీ అధికారులు.. పలు కంపెనీలు, రాజకీయ నేతల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఐటీ దాడులతో రాష్ట్రంలోని రియల్టర్లు, రాజకీయ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. మరికొద్దిరోజుల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందనగా ఐటీ దాడులు జరుగుతుండటంతో నేతలు ఆందోళన చెందుతున్నారు. మాగంటి గోపీనాథ్, మాగంటి వజ్రనాథ్ ఇళ్లతో పాటు వారు బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి.
హఫీజ్ పేట్ సంకల్ప్ అపార్ట్ మెంట్ లో, కేపీహెచ్ బీ 7వ ఫేజ్ లోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అపార్ట్స్ మెంట్స్ తో పాటు కూకట్ పల్లి, షేక్ పేట్, అమీర్ పేట్, శంషాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎల్లారెడ్డిగూడలోని పూజ కృష్ణ చిట్ ఫండ్స్ పై 20 టీమ్స్ తనిఖీలు చేపట్టింది. చిట్ ఫండ్ డైరెక్టర్స్ సోంపల్లి నాగరాజేశ్వరి, పూజలక్ష్మి, ఎండీ కృష్ణప్రసాద్ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. జీవన్ శక్తి చిట్ ఫండ్, ఈ కామ్ చిట్ ఫండ్ కంపెనీలపై కూడా ఐటీ దాడులు జరిగాయి.
వ్యాపార లావాదేవీల్లో ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి ఏకంగా 100 టీమ్ లతో ఈ సోదాలు చేస్తున్నారు. మరోవైపు తమిళనాడులోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయి. డీఎంకే ఎంపీ జగత్ రక్షకన్ నివాసంతో పాటు ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే చెన్నై, అరక్కోణం, వేలూరు, కోయంబత్తూరు సహా 40 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం ఇరు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.