Kaleshwaram: స్వేచ్ఛ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల భారీ అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంజినీర్ల మాట వినకుండా, కేసీఆర్ నియంతృత్వ పోకడలతో తానే పెద్ద ఇంజినీరును’ అని వ్యవహరించడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కాస్తా నాణ్యత దెబ్బతిని ప్రస్తుతం “కూళేశ్వరం”గా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అవినీతిపై బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. వారం రోజులు సమయం ఇస్తే కాళేశ్వరం నుండి నీళ్లు ఇస్తామంటున్న కేటీఆర్.. గత తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఏం చేశారో సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల నాణ్యత పూర్తిగా అనుమానాస్పదంగా ఉందనే వాస్తవం కేటీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. నాణ్యతా లోపాలున్న ప్రాజెక్టులో పంపులు ఆన్ చేస్తే జరిగే నష్టానికి బాధ్యులెవరని నిలదీశారు. గతంలో కేసీఆర్ అహంభావంతో ప్రాజెక్టును నాశనం చేస్తే, ఇప్పుడు కేటీఆర్ కూడా అదే అహంభావంతో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వర్షాభావ పరిస్థితుల వల్ల నీళ్లు లేని సమయంలో.. సముద్రంలోకి నీళ్లు వదులుతున్నారంటూ కేటీఆర్ చేస్తున్న ప్రకటనలు ఆయన అనుభవ రాహిత్యానికి అద్దం పడుతున్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ , సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు లేకుండా బ్యారేజీలను నిర్వహించడం అంటే ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడడమేనని టీపీసీసీ చీఫ్ హెచ్చరించారు. బ్యారేజీల పైపింగ్, పునాదుల్లో లోపాలను ఎన్‌డీఎస్‌ఏ స్పష్టంగా గుర్తించిందని, వాటిని సరిచేయకుండా నీటిని నిల్వ చేయడం అశాస్త్రీయమని, అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా, అడ్డగోలుగా ప్రాజెక్టు కట్టి దాన్ని ఎందుకు పనికిరాకుండా చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజాధనాన్ని, ప్రజల ప్రాణాలను కాపాడుతూ ప్రాజెక్టును రక్షించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. త్వరలోనే సాంకేతిక పరీక్షలు పూర్తి చేసి, శాస్త్రీయ పద్ధతిలో పునరుద్ధరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. కేటీఆర్ ఇప్పటికైనా తన అక్రమాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోతే ప్రజలు బీఆర్‌ఎస్ నేతలను తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు.
Also read: Balamrutham: తెలంగాణ ఫుడ్స్ వేదికగా సీఎం రేవంత్ సంచలన హామీ.. మహిళలకు బంపర్ ఆఫర్!
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీరుపై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడుతుంటే ఆయన బీజేపీ నేతలా మాట్లాడుతున్నారో, లేక బీఆర్‌ఎస్ ఏజెంట్‌లా మాట్లాడుతున్నారో తెలంగాణ సమాజానికి అర్థం కావడం లేదన్నారు.కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు తీయొద్దని ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్‌డీఎస్‌ఏ అధికారులేనని, కేటీఆర్ గానీ, ఈటల గానీ టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ కాదని ఆయన గుర్తుచేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర సంస్థ నిషేధం విధిస్తే.. ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈటలకు దమ్ముంటే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అడిగి రావాలని సవాల్ విసిరారు.
ఈటల రాజేందర్ మాటల్లో బీజేపీ లైన్ ఉందా? లేక బీఆర్‌ఎస్ స్క్రిప్ట్ ఉందా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీలు రెండూ ఒక్కటే అని తాము మొదటి నుంచి చెబుతున్న మాట ఇప్పుడు వంద శాతం నిజమైందని మండిపడ్డారు.”ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ” అన్నట్లుగా బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు కపట నాటకాలు ఆడుతున్నారని, ప్రజ క్షేత్రంలో వారి వైఖరిని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎండగడుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
Also read: Huzurabad: స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్‌లొ కదిలిన ఆర్టీసీ యంత్రాంగం..!