Indiramma Towers: హైదరాబాద్ రెడ్ హిల్స్ వేదికగా పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇక్కడ నిర్మించతలపెట్టిన ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణానికి గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు.
పేదల కన్నీటికి విలువ కట్టలేం
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదవారి కన్నీళ్లకు విలువ కట్టలేమని, వారి జీవితకాల ఆకాంక్ష అయిన సొంతింటి కలను సాకారం చేయడమే ఈ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ఏడాది వ్యవధిలోనే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు చేతికి అందిస్తామని హామీ ఇచ్చారు.
రూ.200 కోట్ల విలువైన స్థలాల్లో నివాసాలు
నగరంలో ఎకరం భూమి విలువ రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆదాయం కంటే పేదల సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. కోర్ ఏరియాలోని ప్రభుత్వ భూములను గుర్తించి, గృహనిర్మాణ శాఖకు బదిలీ చేస్తూ జీ+10 అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
మొదటి విడతగా పూర్తి పారదర్శక పద్ధతిలో లక్కీ డ్రా నిర్వహించి 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇళ్లు రానివారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, రెండు, మూడు, నాలుగో విడతల్లో అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. నగర పరిధిలోని 20 నియోజకవర్గాల్లో భూములను సేకరించామని, ఇప్పటికే 17 ప్రాంతాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయి త్వరలోనే నిర్మాణాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.
Also Read: నీ చేతకాని తనాన్ని పార్టీ అధినేత పై మోపుతావా.. కేటీఆర్ పై కవిత ఫైర్!