TRAI New Rules 2026: మొబైల్ రీఛార్జ్ అంటే కాల్స్, SMS కోసం మాత్రమే ఫోన్ వాడే వాళ్లు కూడా డేటా కోసం అదనంగా డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి చాలాకాలంగా ఉంది. ముఖ్యంగా కీప్యాడ్ ఫోన్లు ఉపయోగించే వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అవసరం లేని యూజర్లకు ఇది అనవసరమైన ఖర్చుగా మారింది. తమకు అవసరం లేని డేటా కోసం ఎందుకు డబ్బు చెల్లించాలంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి.
ఈ సమస్యపై దృష్టి సారించిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. సెప్టెంబర్ 22న విడుదలైన ఈ నిబంధనలతో జియో, ఎయిర్‌టెల్, వీఐ సహా టెలికాం యూజర్లకు తమ అవసరానికి తగ్గట్టుగా రీఛార్జ్ చేసుకునే అవకాశం మరింత పెరగనుంది. అసలు TRAI కొత్త రూల్స్ ఏంటి? డేటా అవసరం లేని వారికి ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది? ఇప్పుడు చూద్దాం.
ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం.. జియో, ఎయిర్‌టెల్, విఐ వంటి టెలికాం కంపెనీలు 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీ ఉండే డేటా ప్లాన్లతో పాటు, కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే ప్లాన్లను కూడా తప్పనిసరిగా అందించాలి. సాధారణ డేటా ప్లాన్లతో పోలిస్తే ఈ ఓన్లీ కాల్ ప్లాన్ల ధరలు కాస్త తక్కువగా ఉండేలా చూడాలని ట్రాయ్ స్పష్టం చేసింది. ఇంటర్నెట్ వాడని వారికి తక్కువ ధరకే ప్లాన్లు అందుబాటులోకి రావడం వల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది.
Also Read: సైబర్ మోసగాళ్ల ఆటకట్టు.. Truecaller Scam Checkerతో మోసాలపై ముందే అలర్ట్!
ఇంతకుముందు రీఛార్జ్ ప్యాక్‌లు ఎక్కువగా 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చేవి. కానీ ఇప్పుడు ట్రాయ్ కొత్త రూల్ ప్రకారం.. టెలికాం కంపెనీలు క్యాలెండర్ నెల ప్రాతిపదికన రీఛార్జ్ ప్యాక్ తెస్తున్నారు. అంటే మీరు ఒక నెలలో ఏ తేదీన రీఛార్జ్ చేసుకుంటే, మరుసటి నెలలో మళ్లీ అదే తేదీకి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ తేదీ ఆ నెలలో లేకపోతే.. ఆ నెల చివరి రోజున రీఛార్జ్ గడువు ముగుస్తుంది. దీంతో వినియోగదారులకు రీఛార్జ్ సైకిల్ గుర్తించుకోవడం సులువవుతుంది.
కేవలం నెలవారీ ప్లాన్లు మాత్రమే కాకుండా.. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం కూడా ట్రాయ్ ప్రత్యేక మార్గదర్శకాలను ఇచ్చింది. డేటా లేకుండా, కేవలం ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ కోసం ఫోన్‌ను ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వినియోగదారుల కోసం లాంగ్ వ్యాలిడిటీ ఆప్షన్లు అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. దీనివల్ల ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే తిప్పలు తప్పడమే కాకుండా.. తక్కువ ఖర్చులో ఫోన్ నంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి వీలవుతుంది.
చాలామంది యూజర్లు భావిస్తున్నట్లు పాత 28 రోజుల ప్లాన్లు అన్నీ ఉన్నపళంగా 30 రోజుల ప్లాన్లుగా మారిపోవు. కంపెనీలు పాత ప్లాన్లను అలాగే ఉంచుతూనే.. కొత్తగా ఓన్లీ కాల్స్ ప్లాన్లను ప్రత్యేకంగా ప్రవేశపెడతాయి. తమ అవసరానికి సరిపడా రీఛార్జ్ ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఇప్పుడు వినియోగదారుడికి లభించింది. ఏమాత్రం ఇంటర్నెట్ వాడని వారికి ఇది నిజంగా ఎంతో కొంత డబ్బు ఆదా చేసే మంచి నిర్ణయమని చెప్పవచ్చు.
Also Read: ఇదే సరైన టైమ్.. iPhone 17పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్, ఆఫర్ వివరాలివే!