BigTV English

Telangana: ఈయన అటు.. వాళ్లు ఇటు.. పోరు తెలంగాణ..

Telangana: ఈయన అటు.. వాళ్లు ఇటు.. పోరు తెలంగాణ..
telangana politics

Telangana politics news: అమిత్ షా.. మాయావతి.. ప్రియాంక.. వారం గ్యాప్‌లో మూడు భారీ బహిరంగ సభలు. అన్నిటికీ ఫుల్ జనాలు. బీజేపీ సభ పెడితే భారీగా ప్రజలు వస్తున్నారు. ప్రియాంక సభలో సైతం జనం కిక్కిరిసిపోయారు. బీఎస్పీ మాయావతి మీటింగ్‌కూ కుప్పలు తెప్పలుగా వచ్చారు. తెలంగాణ ప్రజలు అన్నిపార్టీలను ఆదరిస్తున్నారా? లేదంటే, జనాలు పార్టీల వారీగా విడిపోయారా?


ఏ పార్టీ జాతీయ నేత తెలంగాణకు వచ్చినా.. అంతా కేసీఆర్ కుటుంబ పాలనపై విరుచుకుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని ధీమాగా చెబుతున్నారు. వాళ్లందరి టార్గెట్ తెలంగాణనే. భలే రంజుగా సాగుతోంది రాజకీయం.

అయితే, జాతీయ పార్టీలు, ఆయా కీలక నేతలు తెలంగాణకు క్యూ కడుతుంటే.. గులాబీ బాస్ మాత్రం రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాల్లో దండయాత్ర చేస్తున్నారు. మహారాష్ట్రలో వరుస బహిరంగ సభలు పెడుతున్నారు. బీఆర్ఎస్ సభలకు కూడా జనాలు బాగానే వస్తున్నారు. చేరికలు కూడా భారీగానే ఉంటున్నాయి. విమర్శలు, హామీల గురించి చెప్పనక్కరలేదు.


ఇలా, తెలంగాణలో ఆసక్తికర రాజకీయ రణక్షేత్రం నడుస్తోంది. వన్ టు వన్ ఫైట్ జరిగితే.. ఎవరు గెలుస్తారో అంచనా వేయడం సులభం. కానీ, పోలో మంటూ పార్టీలన్నీ గ్రూప్ వార్‌కు దిగడంతో.. ఎవరు ఎవరిని దెబ్బ తీస్తున్నారో.. ఎవరు ఎవరికి లాభం చేస్తున్నారో తెలీని పరిస్థితి.

బీజేపీకి తెలంగాణ టాస్క్..
కర్నాటకలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మరో నాలుగు నెలల్లో తెలంగాణలో ఎలక్షన్ హీట్ తారాస్థాయికి చేరుతుంది. రానున్న కాలమంతా రాజకీయం మరింత రంజుగా సాగుతుందనడంలో డౌటే అవసరం లేదు. మోడీ, అమిత్‌షాలు ఈసారి తెలంగాణను సీరియస్‌గా తీసుకున్నారు. కాస్త కొట్లాడితే అధికారం గ్యారంటీ అని లెక్కలేస్తున్నారు. కర్నాటకలో ఫలితం అటోఇటో అయితే.. తెలంగాణపై మరింత దృష్టి పెట్టడం ఖాయం. కర్నాటక పోయినా.. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేసి.. దక్షిణాదిన తమ ఉనికిని చాటుకోవడం ఆ పార్టీకి చాలా ముఖ్యం కూడా. సౌత్‌లో బీజేపీకి ఛాన్స్ ఉందంటే అది కర్నాటక.. కాదంటే తెలంగాణ. అందుకే, సర్వం ఒడ్డి కొట్లాడుతోంది కమలదళం. బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ దూకుడు మీదుంది. ఈటలను యాక్టివ్ చేసి చేరికలపై మరింత ఫోకస్ పెట్టింది. వచ్చే ఆరునెలలు మోదీ, షా, నడ్డాలు.. తెలంగాణకు రెగ్యులర్ కస్టమర్లుగా వస్తుంటారు. కేసీఆర్‌ను మాగ్జిమమ్ దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తారు.

హస్తం.. పిడికిలి బిగించేనా?
కాంగ్రెస్ సైతం బీజేపీకి ధీటుగా పోరాడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా గట్టి ఓట్ బ్యాంక్ ఉండటంతో.. కాస్త కష్టపడితే ఈజీగా గెలిచేయొచ్చనేది కాంగ్రెస్ ధీమా. అయితే, బీజేపీకి ఉన్నన్ని వనరులు హస్తానికి లేకపోవచ్చు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రూపంలో బలమైన లీడర్‌షిప్ ఉన్నా.. సీనియర్ల కిరికిరి పార్టీకి తీరని నష్టాన్ని చేస్తోంది. ప్రియాంక గాంధీ హాజరైన యువ సంఘర్షణ సభకు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డుమ్మా కొట్టారంటే ఏమనుకోవాలి? అట్లుంటది కాంగ్రెస్‌తోని. ఇలాంటి నాయకులతో వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ ఏమేరకు నెగ్గుకొస్తుందో?

చిన్నపార్టీలతో పెద్ద చేటు?
బీఎస్పీ ప్రవీణ్ కుమార్, వైఎస్సార్‌టీపీ షర్మిల, రానున్న గద్దర్ పార్టీ.. వీళ్లంతా తెలంగాణ సంగ్రామంలో కీ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ ఎక్కువే. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు వ్యక్తిగతంగా మంచి ఫాలోయింగ్ ఉంది. షర్మిల సైతం తనవంతుగా బానే కష్టపడుతున్నారు. గద్దర్ సంగతి ఇప్పుడేం చెప్పలేం. ఇలా చిన్న పార్టీలు.. సొంతంగా బరిలో దిగితే.. గెలవడం ఏమో కానీ.. వీరు ఎవరిని ఓడిస్తారనే టెన్షన్ ప్రధాన పార్టీల్లో నెలకొంది. ఆయా పార్టీలు చీల్చే ఓటు బ్యాంక్.. ఎవరి విజయావకాశాలకు గండి పడుతుందో.

గులాబీ బాస్ బిందాస్?
ఇక, అసలు విషయం. బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరాగా సభలు, ర్యాలీలు, ధర్నాలతో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తుంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ రెండు పార్టీల మధ్య చీలి.. పరోక్షంగా కేసీఆర్‌కు లాభం చేసే అవకాశం ఎక్కువగా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బహుషా అందుకే కావొచ్చు.. గులాబీ బాస్ బిందాస్‌గా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి.. పక్క రాష్ట్రాలను చుట్టేసే పనిలో ఉన్నారు. తాను ఎలాగైనా గెలుస్తాననేది ఆయన ధీమా. అందుకే, రేవంత్‌రెడ్డి ఆసక్తికర పిలుపు ఇస్తున్నారు. తమకు ఏ ఇరవయ్యో, ముప్పయ్యో సీట్లతో కాకుండా.. ఏకంగా 80 సీట్ల మెజార్టీతో గెలిపించమని ప్రజలకు పదే పదే చెబుతున్నారు. మరి, ఓటర్లు ఎవరిని మన్నిస్తారు? అన్నిపార్టీల సభలకు జనాలైతే వెళ్తున్నారు.. మరి, ఓట్లు ఎవరికి వేస్తారు? వచ్చే ఆరు నెలలు తెలంగాణ పాలిటిక్స్ పీక్ లెవెల్‌లో ఉండటం ఖాయం.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×