TRS MLAs : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ముగ్గురు మధ్యవర్తులు. రెండు ఆడియో లీకులు. అమిత్ షా, సంతోష్ ల పేర్లు. తెలంగాణ రాజకీయం రంజుగా సాగుతోంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ గేమ్ లో ఎవరిది పైచేయో ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ, లీకైన ఫోన్ కాల్ తో మరిన్ని అనుమానాలు. ఆ మధ్యవర్తులు.. మరింత మంది ఎమ్మెల్యేలకు వల విసిరారా?
రామచంద్రభారతి, నంద కుమార్ ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఆసక్తికర విషయం ఒకటి తెలుస్తోంది. తాను ముగ్గురు ఎమ్మెల్యేలను కలవడానికి వెళ్తున్నానంటూ నంద కుమార్.. రామచంద్రభారతికి చెబుతున్నారు. ఎమ్మెల్యేల పేర్లు చెప్పకున్నా.. వారి నియోజకవర్గాలను కోట్ చేస్తూ.. హైదరాబాద్ నుంచి ఎంత దూరం వెళ్లాలో వివరిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్.
తాండూరు, పరిగి, చేవెళ్ల, కొడంగల్ ఎమ్మెల్యేలను కలవబోతున్నట్టు నంద కుమార్ చెప్పారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. ఈ ఎపిసోడ్ లో ఆయనే మెయిన్ లీడ్. తాండూరుతో పాటు పరిగి, చేవెళ్ల, కొడంగల్ ఎమ్మెల్యేల గురించి ప్రస్తావించడం ఆసక్తికరం. మొయినాబాద్ ఫాంహౌజ్ లో రోహిత్ రెడ్డితో పాటు ఉన్న ఎమ్మెల్యేల్లో వాళ్లు లేరు. ఆ ముగ్గురు వేరే. ఈ ముగ్గురు వేరే. అంటే, నందకుమార్ టచ్ లోకి వెళ్లింది పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలతోనని అర్థమవుతోంది. కానీ, డీల్ సమయానికి రోహిత్ రెడ్డి తీసుకొచ్చింది మాత్రం గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులను.
మొదట రోహిత్ రెడ్డికి వల విసిరినట్టున్నారు ఆ ముగ్గురు మధ్యవర్తులు. ఆయనతో మరో ముగ్గురిని లాగారని చూశారు. మరోవైపు, రోహిత్ తో సంబంధం లేకుండా.. మరో లైన్ లో పరిగి, చేవెళ్ల, కొడంగల్ ఎమ్మెల్యేలనూ ట్రాప్ చేసే ప్రయత్నం చేశారనే అనుమానం కలుగుతోందని అంటున్నారు. అందుకే, నందకుమార్ తాను ఆ ముగ్గురిని కలవబోతున్నట్టు ఫోన్ లో రామచంద్రభారతికి చెప్పారనే చర్చ నడుస్తోంది. ఆ లెక్కన ఎవరు చిక్కితే వారు అన్నట్టు పెద్ద వలే విసిరారని.. కేసీఆర్ ఆపరేషన్ వికర్ష్ తో అదంతా బెడిసికొట్టిందని అంటున్నారు. లేదంటే, టీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలేదని చెబుతున్నారు.