Munugodu ByPoll : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడింది. రాజకీయ పార్టీల ప్రచారం పతాకస్థాయికి చేరింది. అటు ఎన్నికల అధికారులు పోలింగ్ ను సక్రమంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో 119 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం 298 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఇబ్బందుల్లేకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్‌సింగ్ చర్యలు తీసుకుంటున్నారు. మద్యం, నగదు పంపిణీ జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలోకి వచ్చే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.
పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని 49 ప్రాంతాల్లో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉపఎన్నిక బరిలో ఉన్న అభ్యర్థుల వ్యయ పరిమితిపై ఎన్నికల పరిశీలకులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ఖర్చుల వివరాలు తెలపాలని టీఆర్ఎస్ , బీజేపీ అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. చెక్‌పోస్టుల వద్ద పనిచేసే సిబ్బంది, సర్వైలైన్స్ టీమ్‌లకు అత్యాధునిక కెమెరాలు ఇచ్చారు. వీరు తీసే వీడియోలు నల్గొండ కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ప్రత్యేక బృందాలు, జనరల్ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 1.93 కోట్ల నగదు పట్టుబడింది. 260 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.
నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం బంద్ అవుతుంది. నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చే ప్రతి ఒక్క ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయడానికి 1192 ఈవీఎంలు, 596 వీవీప్యాట్‌లు, 596 కంట్రోల్‌యూనిట్లను సిద్ధం చేశారు. ఎక్కడైనా ఈవీఎంలలో సమస్య వస్తే వెంటనే సరిచేయడానికి టెక్నికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తైంది.
ఉపఎన్నిక పోలింగ్ కోసం 373 మంది పీవోలు, 373 మంది ఏపీవోలు, 740 ఓపీవోలతోపాటు రెండు వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 16 మంది నోడల్ అధికారులు విధుల్లో ఉన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులకు వీల్‌ఛైర్లను అందుబాటులో ఉంచుతారు. నారాయణపూర్ మండలంలోని మారుమూల గిరిజన తండాల్లోని పోలింగ్ కేంద్రాల్లోనూ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఎవరైనా ఫిర్యాదులు చేయాలంటే 1950కు కాల్ చేయాలి. లేదంటే సీ విజిల్ యాప్ ద్వారా ఆర్వో, ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు.
మునుగోడు నియోజకవర్గంలో అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించారు. నియోజకవర్గంలో 2,41,805 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 1,21,672 ఉండగా…మహిళలు 1,20,126 మంది ఉన్నారు. ఇతరులు ఏడుగురు ఉన్నారు. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో 68 పోలింగ్ కేంద్రాలున్నాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలోనే 24 కేంద్రాలున్నాయి. చండూరు మున్సిపాలిటీలో 11 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.