Nizamabad: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రమూకల కదలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీ-తెలంగాణల్లో వారి మూలాలు బట్టబయలవుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్లుగా ఉగ్రవాదుల యాప్‌లో ఆ యువకుడు యాక్టివ్‌గా ఉన్నట్లు తేలింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలపై నిఘా రెట్టింపు అయ్యింది. ఈ మధ్యకాలంలో ఏపీ లేదా తెలంగాణలో ఉగ్రవాదుల మూలాలు ఎక్కడో దగ్గర బయటపడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. బోధన్ పట్టణంలో అనుమానిత ఉగ్రవాదిని ఎన్‌ఐఏ అధికారులకు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.
స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణం బుధవారం తెల్లవారు జామున నుంచి తనిఖీలు నిర్వహించారు ఎన్‌ఐఏ-ఢిల్లీలోని పటియాలా పోలీసులు. ఈ క్రమంలో ఐసిస్‌తో సంబంధాలు కలిగివున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడ పేరు హుజైఫా ఎమన్. అతడు బీఫార్మసీ చదువుతున్నాడు. నాలుగు గంటలపాటు ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ చేపట్టారు.
బోధన్ కోర్టులో అతడ్ని ప్రవేశపెట్టీన ఢిల్లీ పోలీసులు, తమ కస్టడీలోకి తీసుకున్నారు. పీటీ వారెంట్‌పై ఢిల్లీకి అతడ్ని తరలించారు. యువకుడి నుంచి ఎయిర్ పిస్తోల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. నిందితుడు ఆయుధాలు, మందు గుండ్లు సామాగ్రి తయారీలో చురుకైన పాత్ర పోషించినట్టు సమాచారం.
ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్‌లో టెన్షన్
ఇంతకీ ఎమన్‌ని ఎలా పసిగట్టి అరెస్ట్ చేశారు? అన్నదే అసలు పాయింట్. జార్ఖండ్ లోని రాంచి సిటీలో బాంబు దాడులకు ప్లాన్ చేసిన ఉగ్రవాది డానిష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా డిల్లీ పోలీసులు బోధన్‌లో ఎంట్రీ ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఎమన్ ను విచారించనున్నారు పోలీసులు.
ఎమన్ చేతికి గన్ ఎలా వచ్చింది? జార్ఖండ్ మాదిరిగా తెలంగాణలో ఏమైనా బాంబు దాడులకు ప్లాన్ చేశాడా? ఉగ్రవాది డ్యానిష్‌కు మద్దతిచ్చేవారు ఇంకా ఉన్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఎమన్ అరెస్టు కావడంతో భోదన్ ప్రజలు ఉలిక్కిపడ్డారు.
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్ స్టేట్-ISIS లాంటి సంస్థలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ప్రభావితం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఏపీ, తెలంగాణల్లో కొన్ని కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇంటెలిజెన్స్ విభాగాలు ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ, వారిని నియంత్రించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
రెండునెలల కిందట ఏపీలోని రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా సూట్ కేసు, బకెట్ బాంబులను స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేశారు. అబూబకర్ సిద్దిఖీ, మహ్మద్ అలీ రెండున్నర దశాబ్దాలుగా రాయచోటిలో బస ఏర్పాటు చేసుకున్నట్లు ఐబీ గుర్తించింది. ఇలా రెండు లేదా మూడు నెలలకు ఉగ్రవాదుల మూలాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం కలకలం రేపుతోంది.