Anirudh Reddy: ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి రాజకీయ రగడ రాజుకుంది. తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని ఆరోపిస్తూ.. ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతుండగా, తాజాగా అనిరుద్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
తెలంగాణ విషయమై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు.. ఇప్పటివరకు ఎందుకు క్షమాపణ చెప్పడం లేదని అనిరుద్ రెడ్డి బహిరంగంగానే ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఏం పీకరని అనుకుంటున్నావా..? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు జడ్చర్ల నియోజకవర్గంలో.. ఆయన సినిమా ప్రదర్శనలను అనుమతించబోమని హెచ్చరించారు. ఇది కేవలం రాజకీయ హెచ్చరిక కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలను “నర దిష్టి” అంటూ రాక్షసులతో పోల్చేలా వ్యాఖ్యలు చేయడం.. అత్యంత అవమానకరమని అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తాయని చెప్పారు. తాను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్‌కు అభిమానినైనప్పటికీ, తెలంగాణను చులకనగా చూస్తే మాత్రం సహించేది లేదని స్పష్టంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా అనిరుద్ రెడ్డి గుర్తు చేశారు. సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలనే నిబంధనపై.. ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలన్నారు. దీనివల్ల కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, చిత్ర పరిశ్రమ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.
Also Read: పంచాయతీ ఎన్నికలు.. ప్రత్యర్థుల వేధించి అభ్యర్థిని చంపేశారు, ఎక్కడంటే..
తెలంగాణ అంశంలో మిగతా ఎమ్మెల్యేలందరూ ఒకతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది పార్టీ, రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని, రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని అన్నారు. ఇప్పటికే ఈ అంశంపై స్పందించిన నేతలందరికీ తన తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని కాపాడే విషయంలో ఎవరు ముందుకొచ్చినా వారికి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.




















