సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను జలమండలి ఖండించింది. సుంకిశాల ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ చెప్పినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం నీళ్లను గండిపేటలో కలిసి మూసీలోకి పంపించడానికి రూ.5,500 కోట్లు ఖర్చు అవుతాయని, ఇది మరో కుంభకోణం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ఆరోపణలపై నేడు స్పందించిన జలమండలి కేటీఆర్ మాటలు వాస్తవం కాదని స్పష్టం చేసింది.
Also read: కమల హ్యారిస్ ఓటమితో.. తమిళనాడులోని ఈ గ్రామంలో నిరాశ.. ఎందుకంటే.?
సుంకిశాల ఘటనపై జలమండలి, రాష్ట్ర విజిలెన్స్ , ఎన్ ఫోర్స్‌మెంట్ విచారణ జరిపిందని తెలిపింది. నిర్దేశించిన సమయంలో కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేదని, అందుకే కాంట్రాక్టర్ కు నోటీసులు ఇవ్వలేదని కమిటీ తెలిపిందని జలమండలి పేర్కొంది. అంతే కాకుండా కమిటీ ఇచ్చిన పూర్తి నివేధిక ప్రకారం కాంట్రాక్టర్ పై చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులకు పునరుజ్జీవం కల్పించేందుకే మల్లన్న సాగర్ నుండి నీళ్లు తీసుకురావడానికి గోదావరి ఫేజ్ 2 పథకానికి రూపకల్పన చేసినట్టు తెలిపింది.
అదే విధంగా రూ.1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఇప్పటి వరకు ఎలాంటి అంచనాలు రూపొందించలేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్ లో తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రాజెక్టు రూపొందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అంచనా వ్యయం రూపొందించలేదు. కానీ సోషల్ మీడియాలో అంచనా వ్యయంపై అసత్య ప్రచారం మొదలైంది. సుంకిశాల ఘటనపై సైతం కమిటీ చెప్పని విషయాలను చెప్పినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జలమండలి క్లారిటీ ఇచ్చింది.