Jangaon District: మంత్రాలకు చింతకాయలు రాలవు అని కొందరు అంటారు కదా.. ఎందుకు రాలవో చూస్తామంటున్నారు కొందరు మాయగాళ్లు. ప్రజలను నమ్మించి, మాటల్తో మాయ చేసి ఓం భీమ్ భుష్ అని మంత్రాలు మాత్రం మారడం లేదు.
ప్రస్తుతం అంతరిక్షంలో రాకెట్లు దూసుకెళుతున్నాయి. అరచేతిలోనే ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కానీ ఇలాంటి మూఢ నమ్మకాలు రాజ్యం ఏలుతున్నాయి. చేతబడి, క్షుద్రపూజల పేరుతో జనాలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా జనగామ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఏకంగా యువతి లోదుస్తులు క్షుద్ర పూజలలో కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పాలకుర్తి గ్రామ శివారు దర్ధపల్లి వాగులో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. కోడిని బలిచ్చి, పసుపు, కుంకుమ నిమ్మకాయలతో పూజలు చేసినట్లు అనవాళ్లు ఉన్నాయి. క్షుద్రపూజలు చేసిన స్థలంలో యువతి లోదుస్తులు లభించాయి. యువతికి చేతబడి చేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు.
అయితే అర్ధరాత్రి సమయంలో మంత్రాల శబ్దాలు విని కొందరు రైతులు.. ఘటనా స్థలానికి చేరుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అక్కడ రైతులను చూసి ముగ్గురు వ్యక్తులు పారిపోయినట్లు వారు తెలిపారు. వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దీని వెనుక ఎవరున్నారు. ఆ ముగ్గులో ఉన్న దుస్తులు ఎవరివి అన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ఎవరైనా యువకులు కావాలనే వశీకరణం పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలీదు. కానీ రోడ్లపై ఇలా భయంకరమైన పద్ధతిలో పూజలు చేయడం గ్రామాల్లో సంచలనంగా మారింది. స్త్రీ ఆకారంలో ముగ్గు వేయడం.. అందులో ఓ యువతి లో దుస్తులు ఉండటం చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సైకో పూజలు చేస్తుంది ఎవరు? చేయిస్తుంది ఎవరు పట్టుకుని జైల్లో వేస్తే.. వీళ్ల పవర్ ఏంటో తెలుస్తుందని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.
Also Read: భార్య ప్రియుడిని బడికుండగానే పాతిపెట్టాడు.. అబ్బా!హత్య కోసం ఎంకత ప్లాన్ చేశాడంటే..
ముగ్గులు, నిమ్మకాయలు వేసి క్షుద్ర పూజలు చేయడం ఇటీవల ఎక్కడ బడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. ఇదంతా ఓ పెద్ద మూఢ నమ్మకం అని వివరించనా.. కొంత మంది మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తూ.. ఇలాంటి పూజలు నిర్వహిస్తున్నారు. గుప్త నిధుల కోసం, ప్రత్యర్ధులను నాశనం చేయడం కోసం క్షుద్రపూజలకు పాల్పడుతున్నారు కొందరు మూర్ఖులు.