Telangana Property Tax: తెలంగాణ ప్రభుత్వం నగర, పట్టణ వాసులకు శుభవార్త చెప్పింది. జీహెచ్ఎంసీ పరిధిలో మాదిరిగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులపై భారీ రాయితీని ప్రకటించింది. 90 శాతం వడ్డీ మాఫీతో ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించుకునే అవకాశం కల్పించింది.
ఆస్తి పన్నుదారులకు తీపి కబురు
గృహ వినియోగదారులకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తి పన్ను చెల్లింపులకు భారీ రాయితీని ప్రకటించింది. ఏపీలో 50 శాతం కాగా, తెలంగాణ 90శాతం వరకు ఆఫర్ ఇచ్చింది. తెలంగాణలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీ వాసులకు శుభవార్త. ఆస్తి పన్ను బకాయిలను క్లియర్ చేయడానికి వన్ టైమ్ స్కీమ్ ప్రకటించింది.
2024-25 ఏడాదికి 90 శాతం వడ్డీ మాఫీతో ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించుకునే ఛాన్స్ కల్పించింది. ఈ పద్దతి ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే అమలు చేస్తోంది. ఈ అవకాశ ఇక అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద ఆస్తి పన్నుపై 90 శాతం బకాయి వడ్డీని మాఫీ చేయనుంది.
జీహెచ్ఎంసీ మాదిరిగా
మార్చి 31 వరకు ఆస్తి పన్నుతోపాటు వడ్డీ కేవలం 10 శాతం చెల్లించే వారికి ఈ నిర్ణయం వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. జీహెచ్‌ఎంసీ తరహాలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై 90 శాతం బకాయి వడ్డీని మాఫీ చేసే అవకాశాన్ని కల్పిస్తూ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్- అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశాన్ని గృహ వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరింది.
ALSO READ: జనగామలో క్షుద్రపూజలు, యువతికి చేతబడి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటీఎస్ స్కీమ్ అమల్లో ఉంది. చాలామంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆపై పన్నులు చెల్లిస్తున్నారు కూడా. గతేడాది ఓటీఎస్ స్కీమ్‌ను తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనివల్ల ఎంతో మంది ఆస్తి పన్ను చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈసారీ సిటీ ప్రజల నుంచి మాంచి స్పందన వస్తోందని చెబుతున్నారు.
ఏపీ విషయానికొస్తే..
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ ఆస్తి పన్ను బకాయి దారులకు శుభవార్త చెప్పింది. ఏపీ వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలోని భవనాలకు ఆస్తి పన్నుతోపాటు పాత బకాయిలపై వడ్డీని 50 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఖాళీ స్థలాలకు సైతం ఇది వర్తించనుంది.
2024-25 సంవత్సరానికి చెల్లించాల్సిన వడ్డీ, బకాయిలు 50 శాతం మార్చి 31లోగా చెల్లించేవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తించనుది. ఈ మేరకు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు మేరకు కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల కోసం రాయితీ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ అవకాశాన్ని గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.