 
					Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ప్రధాన పార్టీల కీలక నేతలు ఆ నియోజకవర్గంలో మకాం వేశారు. ప్రత్యర్థులను ఎత్తులు, వ్యూహాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చిక్కుల్లో పడ్డారు. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది?
చిక్కుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
తెలంగాణలోని జూబ్లీహిల్స్ బైపోల్‌ను ప్రధాన పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా ఆ నియోజకవర్గంపై తమ పార్టీ జెండా ఎగురవేయాలని మూడు పార్టీలు తహతహలాడుతున్నాయి. పోలీసుల కంటే పార్టీల కార్యకర్తలు ప్రత్యర్థులపై నిఘా పెట్టాయి. చీమ చిటుక్కుమన్నా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ మీడియా కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ సామ రామ్మోహన్‌రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఉండే ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వివరాలను జత చేశారు. అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు ఎన్నికల అధికారులు. చివరకు బోరబండ పోలీసులు సునీతపై కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసిన బోరబండ పోలీసులు
ఒక్కసారి వెనక్కి వెళ్తే.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.ఆ మరసటి రోజు అంటే అక్టోబర్ ఏడున ఆయన ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన మధురానగర్ పోలీసులు, కేసు నమోదు చేశారు. ఇలా వరుసగా ప్రధాన పార్టీల అభ్యర్థులపై కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది.
మరోవైపు పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఎన్నికల అధికారులు. ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో 127 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు నాలుగేసి చొప్పున 1,628 బ్యాలెట్ యూనిట్లు రెడీ చేస్తున్నారు. 509 కంట్రోల్ యూనిట్లతోపాటు 509 వీవీ ప్యాట్లు ఏర్పాటు చేయనున్నారు.
ALSO READ: వేడెక్కిన జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం రేవంత్, కేటీఆర్ రోడ్ షో
ఇక బైపోల్ కోసం ఏడు కంపెనీల కేంద్ర బలగాలు రంగంలోకి దిగనున్నాయి. వీరితోపాటు 1600 స్థానిక పోలీసులు విధుల్లో ఉండనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నుంచి ఇప్పటిరకు దాదాపు 3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కోడ్ ఉల్లంఘించిన నేతలపై కేసులు నమోదయ్యాయి. ఉప ఎన్నిక కౌంటింగ్ మాత్రం నవంబర్ 14న జరగనుంది.