ENC Hariram: దీర్ఘకాలిక భద్రతకై అన్ని విభాగాలు చర్యలు చేపట్టాలి- NDSAఒక NDSA రిపోర్ట్ వంద ప్రకంపనలుగా మారింది. ఎన్డీఎస్ ఏ రిపోర్టు ఆధారంగా మెరుపు సోదాలు నిర్వహించింది.. ACB. కాళేశ్వరం ENC హరిరాం పేరిట భారీగా ఆస్తులున్నట్టు గుర్తించింది అవినీతి నిరోధక శాఖ. గజ్వేల్ లో 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అంతే కాదు 3 బ్యాంకు లాకర్లున్నట్టు కూడా తేల్చారు. హరి రామ్, అతని బంధువుల ఇళ్లలో 13చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది.
షేక్‌పేట్ , కొండపూర్‌లో విల్లాలు.. శ్రీనగర్,నార్సింగి,మాదాపూర్‌లో ఫ్లాట్స్ గుర్తించారు. ఏపీ రాజధాని అమరావతిలోనూ కమర్షియల్ స్థలం ఉన్నట్టు గుర్తించారు.మార్కుక్ మండలంలో 28ఎకరాల వ్యవసాయ భూమి, పఠాన్ చెరులో 20గుంటల భూమి ఉంది.శ్రీనగర్‌లో రెండు ఇండిపెండెంట్ ఇళ్లు,గాజులరామారంలో 6ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్‌ను గుర్తించారు.కొత్తగూడెం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలోనూ ఓపెన్ ప్లాట్స్‌ను గుర్తించారు ఏసీబీ అధికారులు.
ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు గుర్తింపు
వీటితో పాటు BMW కార్ సహా బంగారు ఆభరణాలు, పలు ఆస్తుల పాత్రలు, బ్యాంకు డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు.ఈఎన్సీ హరి రామ్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. హరి రామ్ దగ్గర వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ అధికారిక వ్యాల్యూ కంటే అనధికారిక బహిరంగ మార్కెట్లో 10రెట్లు ఎక్కువ ఉన్నట్టు తేల్చారు.
కాళేశ్వరం ఎండీ, గజ్వేల్ ప్రాంత ENC గా చేస్తోన్న హరిరాం
ప్రస్తుతం హరిరాం కాళేశ్వరం ఎండీ కాగా.. గజ్వేల్ ప్రాంత ENC గా చేస్తున్నారు. గతంలో కాళేశ్వరం అనుమతులు డిజైన్లు రుణాల సమీకరణలో అత్యంత కీలకంగా వ్యవహరించింది ఈయనే. కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంటుండగా .. ఈ దాడులు జరగటం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది సెప్టెంబర్ 27న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ హరిరాం ను విచారించింది. 90కి పైగా ప్రశ్నలు సంధించింది. అంతే కాదు కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్ధికాంశాలపైనా ఆరా తీసింది. కార్పొరేషన్ బ్యాంకులకు 29 వేల 737 కోట్ల వరకూ చెల్లించినట్టు చెప్పారాయన. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో 64 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించామని కూడా చెప్పారు హరిరామ్. ఇక కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు కొత్త ప్రభుత్వానికి ఇచ్చామని అన్నారు. హరిరాం భార్య సైతం నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో ఉన్నారు.
DPR గ్రీన్ సిగ్నల్ పడక ముందే ప్రాజెక్టుల నిర్మాణం- NDSA
NDSA రిపోర్టు ఆధారంగా.. జరిగిన ఈ దాడుల్లో హరిరాంకి సంబంధించిన అక్రమాస్తుల చిట్టా బయట పడగా.. అసలీ రిపోర్టులో ఏముందన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌కి గ్రీన్ సిగ్నల్ కూడా రాకముందే బ్యారేజీల నిర్మాణం చేపట్టారని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. కాళేశ్వరం అంశాలపై.. ఎన్‌డీఎస్‌ఏ నివేదికను రూపొందించి.. రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ..ఫైనల్ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారికి ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్ అనిల్ జైన్ లేఖ రాశారు. బ్యారేజీల నిర్మాణంలో నీటిపారుదలశాఖ ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొన్నారు.
మేడిగడ్డ 7వ బ్లాక్ కింద పెద్ద గొయ్యి కారణంగా పియర్ కి దెబ్బ
సాంకేతిక పరీక్షలు లేకుండానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్‌లు మార్చారని.. బ్యారేజీలో నిర్వహణ లోపాలే సమస్యలు తెచ్చిపెట్టాయని తెలిపారు. తొలి ఏడాదిలో సమస్య తలెత్తినా.. మరమ్మతులలో జాప్యం జరిగిందని వివరించారు. డ్యామ్ సేఫ్టీ చట్టాన్ని పాటించకపోవడంతో సమస్యలు పెరిగినట్టు పేర్కొన్నారు. మేడిగడ్డ 7వ బ్లాక్ కింద పెద్ద గొయ్యి ఏర్పడటంతో పియర్ దెబ్బతిందని… సికెంట్ ఫైల్ కటాఫ్స్‌లో క్వాలిటీ లేకపోవడం పియర్ కుంగడానికి కారణమైందని వివరించారు. నాణ్యతాలోపం కారణంగా ఎగువ, దిగువన కటాఫ్ సిస్టమ్ విఫలమైందని స్పష్టం చేశారు.
Also Read: మౌనం వీడి షకీల్ నయా వ్యూహం…
దీర్ఘకాలిక భద్రతకై అన్ని విభాగాలు చర్యలు చేపట్టాలి- NDSA
మేడిగడ్డలోని బ్లాక్‌లను పూర్తిస్థాయిలో పరీక్షించాలని తెలిపారు. డిజైన్, నిర్మాణం సరిగా లేకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయని వివరించారు. 3 బ్యారేజీలకు సంబంధించి పూర్తిగా పరీక్షలు జరగాలని… జియో టెక్నికల్, జియో ఫిజికల్ అధ్యయనాలు చేయాలని అన్నారు. హైడ్రాలిక్ మోడల్ స్టడీస్ చేపట్టాలని… అధ్యయనానికి ముందే గ్రౌంటింగ్‌తో అంచనా ఇబ్బందిగా మారిందని వివరించారు. ఎనర్జీ డిసిపేషన్, నిర్మాణ అంశాలను సరిపడా డిజైన్ చేయలేదని పేర్కొన్నారు. అన్ని బ్యారేజీలకు కటాఫ్ వాల్ అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయని వివరించారు. దీర్ఘకాలిక భద్రత కోసం సమష్టిగా అన్ని విభాగాలు చర్యలు చేపట్టాలని ఎస్‌డీఎస్‌ఏ తన నివేదికలో పేర్కొంది.