BigTV English

Kaleshwaram Report: కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్.. బాధ్యులెవరో, తప్పులెవరివో.. పీసీ ఘోష్ రిపోర్ట్‌లో ఏముందంటే!

Kaleshwaram Report: కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్.. బాధ్యులెవరో, తప్పులెవరివో.. పీసీ ఘోష్ రిపోర్ట్‌లో ఏముందంటే!

Kaleshwaram Report: కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ రానే వచ్చింది. అందరూ ఊహించినట్లు, అనుకున్నట్లు సంచలన విషయాలే బయటపడ్డాయి. కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా మారడానికి కారకులు ఎవరు.. ఎవరి నిర్లక్ష్యం ఉంది.. ఎవరి బాధ్యత ఎంత.. ఎవరెవరు ఏయే తప్పులు చేశారు.. ఏయే పర్మిషన్లు తీసుకోలేదు.. ఏయే రిపోర్టులు తొక్కిపెట్టారు… కాంట్రాక్టర్లకు లబ్ది ఎలా చేకూర్చారు.. నెక్ట్స్ ఏం చేయాలి.. ఎవర్ని బాధ్యుల్ని చేయాలి.. ఎవరి దగ్గర్నుంచి డబ్బులు రాబట్టాలి..? ఇవన్నీ కాళేశ్వరం రిపోర్ట్ లో క్లారిటీగా ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.


పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో సంచలనాలు

నదులకు నడకలు నేర్పాం.. నదినే ఎత్తి పోశాం.. మలుపులు తిప్పాం.. కాళేశ్వరం ఒక చరిత్ర.. అపర భగీరధుడు కేసీఆర్.. ఇదీ మొదట్లో కాళేశ్వరం గురించి బీఆర్ఎస్ చేసుకున్న ప్రచారం. సీన్ కట్ చేస్తే అదంతా ఓ కలలా కరిగిపోయింది. ఎంతో ఊహించుకుని కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. మరి ఎందుకు కూలింది.. ఎవరెవరి తప్పులేంటి.. ఇవన్నీ లెక్కలు తేలాలి కదా.. అందుకే రేవంత్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ను నియమించడం.. ఆ కమిషన్ రిపోర్ట్ రెడీ చేయడం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం ఇవన్నీ జరిగిపోయాయి. ఈ కమిషన్ ఏం తేల్చిందో పాయింట్ టూ పాయింట్ చూద్దాం.


తప్పు 1 :
ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో మొదటి తప్పు.. ఐదుగురు రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్లతో వేసిన కమిటీ రిపోర్ట్ ను తొక్కిపెట్టడం. మేడిగడ్డలో ప్రాజెక్టు నిర్మించొద్దని లిఖిత పూర్వకంగా రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోకపోవడం. లొకేషన్ మార్చడం. ఇలా ఎందుకు ఎక్స్ పర్ట్స్ కమిటీ వేశారు.. ఎందుకు తొక్కిపెట్టారన్నది కాళేశ్వరం కూలుడుతోనే తెలంగాణ ప్రజలకు క్లారిటీ వచ్చింది. పాత లొకేషన్ అంటే తుమ్మడిహెట్టి దగ్గరే ఉండి ఉంటే ఇంత లాస్ జరగకపోయేది.

తప్పు 2:
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలని మొదట నిర్ణయం తీసుకున్నాకే.. ఆయా చోట్ల బ్యారేజీలు కట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసే బాధ్యతను వ్యాప్కోస్ అప్పగించారని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ నిర్ధారించింది. ఆ తర్వాత వ్యాప్కోస్‌ రిపోర్ట్ ఆధారంగానే బ్యారేజీలు కట్టామని కేసీఆర్‌, హరీశ్‌ రావు కమిషన్‌ ముందు సాక్ష్యాలు ఇచ్చారు. ఇది కంప్లీట్ మిస్ లీడింగ్ వ్యవహారం తప్పుడు సాక్ష్యాలు అని ఘోష్ కమిషన్ గుర్తించింది.

తప్పు 3:
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జీవోలు 231, 232, 233 జారీ చేశారని, కానీ వాటిని క్యాబినెట్‌ ముందు ఉంచలేదని, మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, ఇది ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమేనని గుర్తించింది.

తప్పు 4:
కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు 71,436 కోట్ల రూపాయలు అని ప్రధాన మంత్రికి 2016 ఫిబ్రవరి 21న నాటి సీఎం కేసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే అప్పటికి వ్యాప్కోస్‌ ఫైనల్ డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించలేదు. అలా జరగకముందే కేసీఆర్ స్వయంగా 71 వేల కోట్లు అవుతుందంటూ ప్రధానికి లేఖ ఎలా రాస్తారని రిపోర్ట్ లో క్వశ్చన్ చేశారు.

తప్పు 5:
బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ టర్న్‌ కీ పద్ధతిలో జరగాలని కేంద్ర జలవనరుల సంఘం సూచించగా.. లంప్సమ్‌ పద్ధతిలో నిర్మాణ సంస్థలకు పనులు కట్టబెట్టడం ఏంటని ఘోష్ కమిషన్ రిపోర్ట్ తప్పుబట్టింది. ఎవరైనా అలా చేస్తారా అని క్వశ్చన్ చేసింది. అంతే కాదు ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచేయడం వెనుక మతలబులనూ బయటపెట్టింది. మొదట ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 38,500 కోట్లు కాగా.. ఆ తర్వాత దానిని 71,436 కోట్లకు, ఫైనల్ గా 1,10,248 కోట్ల రూపాయలకు పెంచేశారన్నది.

తప్పు 6:
నిర్మాణ సంస్థలకు అనుచితంగా లబ్ది చేకూర్చడానికి రెండు దఫాలుగా అంచనాలను సవరించారని కమిషన్ తప్పుపట్టింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ స్థలాలను మార్చారని, ఆ పేరిట బ్యారేజీల పొడవు, ఫ్లడ్‌ బ్యాంకులు, డిజైన్లలో మార్పులు చేశారన్నది రిపోర్ట్. వాటిని అడ్డం పెట్టుకుని ప్రాజెక్టు అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేశారని ఐడెంటిఫై చేసింది.

తప్పు 7:
బ్యారేజీల డిజైన్‌ను ఫ్లోటింగ్​ స్ట్రక్చర్లుగా అంటే తేలియాడే విధంగా చేసి, వాటిని రిజర్వాయర్లుగా వినియోగించారని, ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్ కు విరుద్ధమని గుర్తించింది కమిషన్.

తప్పు 8:
ఇక బ్యాక్‌ వాటర్‌ స్టడీస్, టెయిల్‌ వాటర్‌ రేటింగ్‌ కర్వ్‌లు, జీ-డీ కర్వ్‌లు, జియో ఫిజికల్‌ టెస్టులేవీ చేయకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేపట్టారన్నది కమిషన్.

తప్పు 9:
మేడిగడ్డ నిర్మాణం పూర్తి కాకుండానే పూర్తయినట్లు నిర్మాణ సంస్థకు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని, బ్యారేజీల్లో లోపాలు బయటపడినా.. లీకేజీలు కనిపించినా పట్టించుకోకుండా వీటిని జారీ చేయడాన్ని కమిషన్ నివేదిక తప్పుబట్టింది.

తప్పు 10:
ప్లానింగ్‌లో, సాంకేతిక, ఆర్థిక క్రమశిక్షణలో నిర్లక్ష్యంతో భారీ ఎత్తున ప్రజా ధనం వృథా కావడానికి కారణమయ్యారు. ఇందులో నాటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారు.. అలాగే ఇంజినీర్లు, కాంట్రాక్ట్​ దక్కించుకున్న సంస్థలు వీళ్లంతా బ్యారేజీలు విఫలమవడంలో ప్రధాన కారణమని కమిషన్​ తేల్చి చెప్పింది.

సో కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు అందరి నిర్లక్ష్యంతో కాళేశ్వరాన్ని కుప్ప చేసి పెట్టారని కమిషన్ తన 650 పేజీలతో మూడు వాల్యూమ్‌లుగా ఇచ్చిన రిపోర్ట్ లో స్పష్టం చేసింది. కాళేశ్వరంపై 2024 మార్చి 13న ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 58 అఫిడవిట్ల ఆధారంగా 115 మంది అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులను విచారించారు. గతేడాది ఆగస్టు 21న ఓపెన్ కోర్టు నిర్వహించి స్టేట్‌మెంట్లు సేకరించి రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ తో కాళేశ్వరం డార్క్ సీక్రెట్స్ అన్నీ అఫీషియల్ గా ఓపెనప్ అయ్యాయి.

కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఎవరెవరు బాధ్యులో కేసీఆర్ హరీష్ రావు ఈటల, ఈఎన్సీ, సీఈ ఇలాంటి వారందరి పేర్లను ప్రస్తావించింది. ఈ ప్రాజెక్ట్ వైఫల్యంలో ఎవరి బాధ్యత ఎంత ఉంది? జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ లో ఏయే తప్పులు చేశారని ప్రస్తావించింది. తప్పు జరిగిందని తేలింది సరే.. మరి నెక్ట్స్ జరగబోయేదేంటి? అరెస్టులు ఉంటాయా? గతంలో మనదేశంలో ఇలాంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ల విషయంలో జరిగిందేంటి?

కమిషన్ రిపోర్ట్‌లో కీ రోల్ కేసీఆర్ దే

కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకోని రోజు లేదు. అసలు డిజైన్ చేసింది తానే అని ఒక సందర్భంలో కేసీఆర్ చెప్పుకున్నారు. తన మెదడు, రక్తం కరిగించి కట్టానన్నారు. బరాజ్ కుంగిన తర్వాత ప్రశ్న అడిగితే.. తనకేం తెలుసని, అంతా ఇంజినీర్లదే అని అన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ లో కీ రోల్ అంతా కేసీఆర్ దే అని తేలింది. పేపర్ పై ప్రాజెక్టును అద్భుతమని చూపించింది గత ప్రభుత్వం. 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు 1698 గ్రామాలకు లబ్ది అంటూ ఆహా ఓహో అన్నారు. 28 ప్యాకేజీలు, 7 మెగా లింకులతో నిర్మించిన కాళేశ్వరం కథలన్నీ వట్టివే అని తేలిపోయాయి. మేడిగడ్డ కుంగింది. అన్నారం, సుందిళ్లలో సీపేజ్ లు వచ్చాయి. ఇప్పుడంతా ఇరుక్కోవాల్సి వచ్చింది.

కేసీఆర్ చేసిన తప్పేంటి?
కాళేశ్వరం కూలడానికి బాధ్యులెవరో పీసీ ఘోష్ కమిషన్ క్లారిటీగా ఇచ్చింది. ఇందులో నెంబర్ వన్.. కేసీఆర్. మాజీ సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చి, తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా మేడిగడ్డకు షిఫ్ట్ చేయించారు. ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల ప్లానింగ్​, నిర్మాణం, కంప్లీషన్​, ఓ అండ్​ ఎంలలో అవకతవకలు, అక్రమాలకు… ప్రత్యక్షంగా, పరోక్షంగా అప్పటి సీఎం కేసీఆరే బాధ్యుడని పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాల వల్లే మూడు బ్యారేజీలకు ఇప్పుడీ దుస్థితి ఏర్పడిందన్నది. అంతేకాదు వాప్కోస్ రిపోర్ట్ విషయంలో కమిషన్ ముందు తప్పుడు సాక్ష్యమిచ్చారన్నది.

హరీష్ రావు బాధ్యత ఎంత?
అప్పటి సీఎం కేసీఆర్ తో పాటు అప్పటి ఇరిగేషన్​ మంత్రి హరీశ్​ రావు కూడా ఉద్దేశపూర్వకంగానే ఎక్స్ ​పర్ట్​ కమిటీ నివేదికను తొక్కిపెట్టారన్నది కమిషన్. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు ప్రదేశాన్ని తరలించవద్దన్న నిపుణుల కమిటీ సూచనను అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదని, ఎలాంటి జవాబుదారీతనం లేకుండా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, పాలన ప్రక్రియను తుంగలో తొక్కారని కమిషన్ తప్పుబట్టింది.

ఈటల చేసిందేంటి?
కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ​పై ఉన్నా.. ఆయనలో ఆ కమిట్ ​మెంట్​ లోపించిందని కమిషన్ గుర్తించింది. ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఆర్థిక నిర్ణయాలపై సరిగ్గా దృష్టి సారించలేదని, కాళేశ్వరం కార్పొరేషన్​ బోర్డులో ఆర్థిక శాఖ కూడా భాగమైనా అది తమ బాధ్యత కాదని తప్పించుకునే ప్రయత్నాలు చేశారన్నది. ఆర్థిక జవాబుదారీతనం తన బాధ్యత కాదనుకున్నారన్నది.

ఎస్కే జోషి కథేంటి?
అప్పట్లో ఇరిగేషన్​ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సీఎస్ ​గా ఉన్న ఈయన ఎక్స్ ​పర్ట్​ కమిటీ నివేదికను తొక్కిపెట్టారని, పరిపాలనకు, అనుమతులకు సంబంధించి బిజినెస్​ రూల్స్ ​ను ఉల్లంఘించారని, కాళేశ్వరం కార్పొరేషన్​ ఫెయిల్యూర్ ​కు బాధ్యుడన్నది కమిషన్.

స్మితా సబర్వాల్ ఏం చేశారు?
అప్పటి సీఎంవో సెక్రటరీగా స్మితా సబర్వాల్​ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోయారని, కేబినెట్​ అనుమతులకు సంబంధించి బిజినెస్​ రూల్స్​ ప్రకారం నడుచుకోలేదన్నది కమిషన్. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అశ్రద్ధ, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారన్నది.

మురళీధర్ ​రావు ఏమార్చారా?
ఈఎన్సీగా విధుల్లో ఉన్నప్పుడు మురళీధర్ రావు కేంద్ర జలసంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎక్స్ ​పర్ట్​ కమిటీ నివేదికను దాచేశారు. దురుద్దేశపూర్వకంగా అంచనాలను పెంచారని, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లో ఫెయిలయ్యారని గుర్తించింది.

బి.హరిరాం చేసిందేంటి?
ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు సీఈగా సీడబ్ల్యూసీకి హరిరాం తప్పుడు సమాచారం ఇచ్చారన్నది కమిషన్. ఎక్స్ ​పర్ట్స్​ కమిటీ నివేదికను తొక్కిపెట్టారని, కాళేశ్వరం కార్పొరేషన్​ ఎండీ అయి ఉండి కూడా బ్యారేజీల సంగతి తనకు తెలియదంటూ చెప్పారని గుర్తు చేసింది.

మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో గాయత్రి, నంది మేడారం పంప్ హౌస్‌ల ఇన్-చార్జ్ నూనె శ్రీధర్, మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ హరిరాం నాయక్ వీళ్లంతా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్ట్ లో వీళ్లకు మరింత చిక్కులు ఖాయమే అంటున్నారు. సో చెప్పుకుంటూ వెళ్తే లిస్టు బాగా పెద్దదిగానే ఉంది. చాలా మంది నిజాలు దాచడం, కమిషన్ ముందు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చారన్నది రిపోర్ట్. బ్యారేజీలను ఎప్పటికప్పుడు ఇన్​స్పెక్షన్ చేయకపోవడం​, డ్యామ్​ సేఫ్టీ డ్యూటీలు చేయడంలో విఫలమవడం, డ్యామ్​ సేఫ్టీ యాక్ట్​ ప్రకారం పనిచేయకపోవడం ఇవన్నీ కాళేశ్వరం కూలిపోవడానికి కారణమయ్యాయి.

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టైతే ఇచ్చింది. మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా కమిషన్ చెప్పింది. ప్రాజెక్ట్​ నిర్మాణంలో ఏజెన్సీతో అధికారులు కుమ్మక్కయ్యారన్నది. దురుద్దేశపూర్వకంగా వ్యవహరించి దాని నుంచి లబ్ధి పొందాలని చూశారని వెల్లడించింది. బ్యారేజీలకు వ్యాప్కోస్​ సంస్థతో స్టడీ చేయించినా.. ఆ నివేదికనూ పక్కన పడేశారని కమిషన్​ తెలిపింది. అందుకు సంస్థకు చెల్లించిన 6.77 కోట్లను సంబంధిత అధికారుల నుంచి వసూలు చేయాలని సిఫార్సు చేసింది. మేడిగడ్డ ఏడో బ్లాక్​ కుంగుబాటులో ఏజెన్సీ ఎల్​ అండ్​ టీ పాత్ర కూడా ఉందన్నది. ఏడో బ్లాక్​ పునరుద్ధరణను ఎల్​ అండ్​ టీ ఖర్చులతోనే చేయించాలని సిఫార్సు చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో డిఫెక్ట్​ లయబిలిటీ పీరియడ్​ లోనే సమస్యలు వచ్చినందున.. ఆయా సంస్థలతోనే రిపేర్లు చేయించాలని సూచించింది. మరి ఇందులో ఎంత వరకు వర్కవుట్ అవుతాయన్నది ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది.

Also Read: పబ్బుల్లో ఐటీ ఎంప్లాయిస్‌ గబ్బు గబ్బు.. ఎందుకిలా మారుతున్నారు? కారణం ఇదేనా?

భారత్ లో గతంలో వివిధ అంశాలపై ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్లు తమ నివేదికలు ఇచ్చాక తరచుగా రాజకీయ ఒత్తిడి, ఆలస్యం, అమలు జరగపోవడం వంటివి జరిగాయి. కాళేశ్వరం విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారమైతే క్రిమినల్ చర్యలు, ఆర్థిక నష్టపరిహారం, బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని సూచనలు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. అన్నారం, సుందిళ్లలో సీపేజీ సమస్యలు తలెత్తాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్యటించి ప్రాథమికంగా లోపాలేంటో గుర్తించింది. సో ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, నిధుల దుర్వినియోగం, అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నట్లు కమిషన్ అంటోంది. నెక్ట్స్ ఏంటన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

Story  By Vidya Sagar, Bigtv

Related News

Raj Gopal Reddy: కేసీఆర్ మౌనంగా ఉంటే ఎలా? లేదంటే రాజీనామా చేయ్..

Telangana Bjp: టచ్‌లో బీఆర్ఎస్ నేతలు.. ఆపై మంతనాలు, రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

Congress: బీసీ రిజర్వేషన్ల కోసం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా

Weather Alert: బీ అలర్ట్..! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..

KTR In Delhi: కేటీఆర్ ఢిల్లీ ముచ్చట్లు.. ఆ భేటీ ఉద్దేశమేంటి?

KCR Big Sketch: గువ్వల రిజైన్ వెనుక కేసీఆర్ కొత్త స్కెచ్ ?

Big Stories

×