Kalvakuntla Kanna Rao Scams in Telangana: కల్వకుంట్ల కన్నారావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తమకు అన్యాయం జరిగిందంటూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా.. కిడ్నాప్ చేసి చంపాలని చూశారని విజయవర్ధన్ రావు అనే వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించాడు.
కన్నారావుకు విజయ వర్ధన్ రావు వరుసకు తమ్ముడు అవుతాడు. కన్నారావు గ్యాంగ్ లోని నందిని చౌదరి, తులసిరామ్, శ్యామ్ ప్రసాద్, సంతోష్, మాజీ మంత్రి హరీష్ రావు తమ్ముడు మహేష్ తనను వేధించి చిత్రహింసలకు గురిచేశారని విజయవర్ధన్ ఆరోపిస్తున్నారు.
నిజాంపేటలో కన్నారావు గ్యాంగ్ ఖరీదైన 600 గజాల భూమిని కబ్జా చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. 2021లో తమ భూమిలోకి అక్రమంగా చొరబడి కబ్జా చేశారని.. తమను రానివ్వడంలేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో కన్నారావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కన్నారావు అక్రమాల లెక్క అంతకుమించి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
Also Read: అందుకే కేసీఆర్ అన్న కొడుకు అరెస్ట్
గతేడాది డిసెంబర్ 31న శ్యాంప్రసాద్ తో కలిసి కన్నారావు తన ఇంటికి వచ్చి.. కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించారని విజయవర్ధన్ రావు ఆరోపించారు. కన్నారావు, నందిని, మహేష్ కలిసి.. డబ్బు, నగల విషయం గురించి చర్చించుకున్నారని చెప్పారు. గతంలోనే తనను బెదిరించి 60 లక్షల నగదు, దాదాపు కిలో బంగారు నగలు లాక్కున్నారని వెల్లడించారు.
మరోవైపు నందిని చౌదరి గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టారు విజయవర్ధన్ రావు. విజయవాడ, మంగళగిరిలో గీతామాధురిగా చెలామణి అవుతూ కోట్ల రూపాయలు వసూలు చేసి హైదరాబాద్ కు వచ్చినట్టు వివరించాడు. ఇక్కడ కన్నారావుతో పరిచయం పెంచుకుని శ్యాం ప్రసాద్ ను పీఏగా నియమించుకుని మోసాలకు తెరతీసిందని విజయవర్ధన్ అన్నారు. కన్నారావు, నందిని, తులసిరామ్, శ్యాం ప్రసాద్, సంతోష్ కలిసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.