Kavitha: స్వేచ్ఛ, బ్యూరో: వెలుగుమట్ల బాధితులందరికీ న్యాయం కోసం.. ఏం జరిగిందో తేల్చడానికి నిజ నిర్ధారణ కమిటీ వేశామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేసేందుకు కమిటీ దోహద పడుతుందని వెల్లడించారు. ఈ కమిటీ బుధవారం వెలుగుమట్లలో పర్యటిస్తారని, బాధితులు, ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతారన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణంగా వెలుగుమట్లలో ఎటువంటి నోటీసులు, హెచ్చరిక లేకుండా పేదల వాళ్ల 750 ఇళ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మసమాజ్ పార్టీ, జాగృతి ఈ అన్యాయం పై చేసిన పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చి కూల్చిన చోటే 350 మందికి పట్టాలు ఇస్తామని…మరో 110 మందికి వాళ్ల గ్రామాల్లో ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామని ప్రకటించిందన్నారు. 750 మంది ఇళ్లను కూల్చేసి, 460 మందికి మాత్రమే ఇళ్లను ఇస్తామంటున్నారని, చాలా మందికి న్యాయం జరగలేదన్నదన్నారు.
Also Read: Priyanka Chopra: చరిత్ర సృష్టించిన ప్రియాంక చోప్రా.. మొట్టమొదటి ఇండియన్ సెలబ్రిటీగా!
ఈ ప్రభుత్వం ఏమాత్రం పారదర్శకత లేకుండా ఉందని, ప్రభుత్వం బాధ్యతయుతంగా మెలిగేలా ఎలా చేయాలన్న దానిపై మేము చర్చించామన్నారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, ఆర్మీ మాజీ మేజర్ మదన్ కుమార్, ప్రొఫెసర్లు అనురాధ, నాగం కుమార స్వామి, రామయ్యతో పాటు లాయర్లు సుంకర నరేష్, శ్రావణ్ గౌడ్, నూర్జన్, జర్నలిస్టులు తెలంగాణ విఠల్, ఆకాశ్ గౌడ్, క్రాంతి లాంటి వాళ్లు ఒక కమిటీ గా ఏర్పడ్డారన్నారు. పేదలకు న్యాయం చేసేందుకు వాళ్లు ఉద్యోగాలు చేస్తూనే సమాజం కోసం పోరాటం చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. ప్రభుత్వం, అధికారులు ఈ కమిటీకి సహకరించాలని కోరారు.
డిసెంబర్ 9 నాటికి వాళ్ల ఇళ్లను పూర్తి చేస్తామని చెబుతున్నారని, కానీ అప్పటి వరకు ఆ పేదలు ఎక్కడ ఉండాలి? అని ప్రశ్నించారు. వాళ్ల ఇంటి అద్దె, పిల్లల చదువుకు కావాల్సిన సాయం ప్రభుత్వమే చేయాలని డిమాండ్ చేశారు. కమిటీ ద్వారా బాధితులకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాలుగా పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ప్రొఫెసర్ కోదండ రాం, హరగోపాల్, ఆకునూరి మురళి లాంటి వాళ్లు కూడా స్పందించాలని కోరారు. మేధావుల మౌనం సమాజానికి ఎంతో నష్టం చేస్తుందన్నారు. ఈ కమిటీ ఒక న్యూట్రల్ కమిటీ అని, వారికి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.