Kalvakuntla Kavitha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు.. మరోసారి రాష్ట్ర రాజకీయ చర్చలకు దారి తీశాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి, ఆయన చూపిన సమానత్వ పథం లేకపోయి ఉంటే తెలంగాణ ఉద్యమం అంత భారీ విప్లవంగా మారేది కాదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కేవలం రాజకీయ డిమాండ్ మాత్రమే కాదని, అది సామాజిక స్వరమేనని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం కేవలం భావోద్వేగాలపై నడిచింది కాదు. అది అంబేద్కర్ చూపించిన రాజ్యాంగ మార్గాన్ని అనుసరించి సాగిన ప్రజా పోరాటం. సమానత్వం కోసం, న్యాయం కోసం మన రాష్ట్రం కదిలింది. ఆ మహనీయుడి ఆలోచనలే ఉద్యమానికి బలాన్నిచ్చాయి అని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో.. అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠించాలన్న ఆలోచన ముందుకు తీసుకెళ్లిన తొలి సంస్థ జాగృతేనని కవిత గుర్తు చేశారు. అప్పట్లో పెద్దఎత్తున యువత, విద్యార్థులు, సామాజిక వేత్తల్ని ఒకే వేదికపైకి తీసుకుని వచ్చిన ఉద్యమాల్లో జాగృతి పాత్ర అపారమని తెలిపారు.
తెలంగాణ వచ్చిన తరువాత కూడా పోరాటం ముగిసిపోలేదని, ఇది కొత్త దశలోకి ప్రవేశించిందని కవిత చెప్పారు. సమాజంలోని ప్రతి వర్గానికీ అవకాశాలు, న్యాయం, సమానమైన హక్కులు కలిగేలా సామాజిక తెలంగాణ నిర్మాణమే జాగృతి ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
రాజకీయ తెలంగాణ వచ్చి దశాబ్దం దాటింది. ఇప్పుడు లక్ష్యం సామాజిక తెలంగాణ. సమానత్వం, విద్య, ఉపాధి, అవకాశాలు ఈ నాలుగు పాదాలపైనే కొత్త తెలంగాణ నిలబడాలి. అందుకే ప్రజాస్వామికవాదులను, యువతను, మహిళలను పెద్ద ఎత్తున జాగృతి చేర్చుకుంటోంది అని కవిత చెప్పారు.
Also Read: సీఎం సార్ మీరు గ్రేట్.. రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే పొగడ్తలు
జాగృతి కేవలం సాంస్కృతిక సంస్థ మాత్రమే కాదు, ఉద్యమాలకు శక్తినిచ్చే మానవ వనరు అని కవిత పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల నుంచి యువత, మహిళలు పెద్ద సంఖ్యలో జాగృతి కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ఆమె అభినందించారు.