SC ST Commissions: స్వేచ్ఛ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ కమిషన్ సహా దేశంలో ఉన్న అన్ని కమిషన్లకు ఎన్ ఫోర్సెబుల్ అధికారాలు ఉండాలని.. అందుకోసం రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరముందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేవలం అడ్వయిరీ బాడీగా ఉన్న కమిషన్ కు రాజకీయ నాయకులు లేదా రిటైర్డ్ జడ్జిలలో ఎవరు ఛైర్మన్ గా ఉన్న ప్రయోజనం ఉండదన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఎన్ ఫోర్సెబుల్ అధికారాలు వచ్చేలా మనం పోరాటం చేయాలని సూచించారు. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్న ఆ దిశగా ఎవరూ ఆలోచించకపోవడం విచారకరమన్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఒత్తిడి..
ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ జరిగేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఇచ్చిన వందలాది తీర్పులను అసలు అమలు చేయడమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఓ ఉద్యోగి ప్రమోషన్ కు సంబంధించి ఎస్సీ కమిషన్ ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారని ఆ కేసులో ఎస్సీ కమిషన్ తీర్పును అమలు చేయాలన్న రూల్ లేదని హైకోర్టు కొట్టివేసిందన్నారు. నేరెళ్ల సంఘటనకు సంబంధించి ఇప్పటికీ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదని.. ఒక వేళ ఇచ్చినా ఆ రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్న రూల్ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లు టూత్ లెస్ టైగర్లు అన్న విధంగా మారిపోయాయని విచారం వ్యక్తం చేశారు.
ఈసీ, సెబీ తరహా చర్యలు చేపట్టే అధికారం ఉండాలి
ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగాలంటే ఆయా కమిషన్లు చెబితే కచ్చితంగా చర్యలు తీసుకునే విధానం ఉండాలన్నారు. ఎలక్షన్ కమిషన్, కంపీటీషన్ ఆఫ్ ఇండియా, సెబీ లాంటి సంస్థలకు డైరెక్ట్ గా చర్యలు తీసుకునే అధికారాలు ఉన్నాయని గుర్తు చేశారు. అందుకే అక్కడికొచ్చే సమస్యలు వెంటనే పరిష్కారమవుతున్నాయని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ కు ఉన్న అధికారాల కారణంగానే దేశంలో 13 కోట్ల మంది ఓట్లు తొలగించిందన్నారు. మన వద్ద మహిళ, చిల్డ్రన్, మానవ హక్కుల కమిషన్లు కూడా అడ్వయిజరీ బాడీలేనన్నారు. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో మానవ హక్కుల కమిషన్ కు అన్ని అధికారులుంటాయని చెప్పారు. మన దేశంలో మాత్రం సామాన్యలకు కాకుండా వ్యాపార వేత్తలకు మాత్రమే ప్రత్యేక కమిషన్లు, హక్కులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెబీ లాంటి వ్యాపారులకు ఉపయోగపడే సంస్థకు సర్వ అధికారాలు ఇచ్చారని చెప్పారు. ఆ సంస్థలో అంబానీ, అదానీ మనుషులు ఉండటంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామిక వేత్తలు ఎవరైనా వస్తే ఎదగనివ్వటం లేదన్నారు.
అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు
తెలంగాణలో ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఒక్కటిగా ఉందని..కానీ ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఉండాల్సిన అవసరముందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అప్పటి వరకు అందుకోసం పోరాటం చేస్తామని చెప్పారు. కేంద్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఉండేవని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను వేర్వేరుగా కాకుండా కలిపి ఉంచారన్నారు. ఎస్టీల సమస్యలు వేరైతే, ఎస్సీల సమస్యలు వేరని ఆమె చెప్పారు. వేల ఏళ్లుగా అగ్రకులాల కారణంగా ఎస్సీ లు వివక్ష, దోపిడీ, అత్యాచారాలు, అవమానాలు ఎదుర్కొని ఎంతో అన్యాయానికి గురయ్యారన్నారు. ఎస్టీలు ఎప్పుడు స్వాతంత్రంగా ఉండేవాళ్లని వాళ్ల పోరాటం వేరని చెప్పారు. ప్రజల బాధలు తెలిసిన వ్యక్తులు కమిషన్ చైర్మన్ గా ఉంటేనే ఆయా వర్గాల వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో ఉన్నట్లుగానే రాజకీయాల్లోనూ కొంతమంది చెడ్డవాళ్లు ఉంటారని.. అంతమాత్రాన మొత్తం వ్యవస్థను తప్పుబట్టటం సరికాదని అన్నారు. ప్రజల అర్ధ్రత తెలిసిన వారిని కమిషన్ ఛైర్మన్ గా నియమిస్తే బాగుంటుందన్నారు. దాని కన్నా ముందు ఎన్ ఫోర్సెబుల్ అధికారాల కోసం పోరాటం ముఖ్యమని సూచించారు.
Also Read: ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా? రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!