Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో: రాజ్యాంగాన్ని కాపాడతామని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని, ప్రతిపక్షాల గొంతుకను గౌరవించాలని కాంగ్రెస్ పదేపదే చెబుతోందని, కానీ ఢిల్లీలో ఆ పార్టీ చెబుతున్న మాటలకు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన కనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణికి ఢిల్లీలో, హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ డబుల్ గేమ్!
ఢిల్లీలో ప్రజాస్వామ్య హక్కులు గుర్తొచ్చే కాంగ్రెస్ కు.. తెలంగాణలో మాత్రం బీజేపీని నిర్బంధించడం వస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గత 3, 4 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల కారణంగా.. ప్రజలకు అసౌకర్యం కలిగినా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా.. వారికి నిరసన తెలిపే అవకాశాన్ని అనేకసార్లు ఢిల్లీ పోలీసులు కల్పించారని ఆయన గుర్తుచేశారు. రాహుల్ గాంధీ దేశమంతా స్వేచ్ఛగా తిరుగుతూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారన్నారు. మోడీని తీవ్రంగా విమర్శిస్తున్నారని, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, భారత సైన్యం వంటి సంస్థలపైనా ఆరోపణలు చేస్తున్నారన్నారు.
అధికారం ఉన్న చోట ఒకలా… లేని చోట మరోలా?
వారు అబద్ధాలు ప్రచారం చేసినా.. రాజకీయంగా ఆయన మాట్లాడే హక్కును అడ్డుకోవాలని కేంద్రం ఏనాడూ ప్రయత్నించలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిరసనలు తెలపొచ్చని, కానీ బీజేపీ మాత్రం తెలంగాణలో నిరసనలు తెలపకూడదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినా జీర్ణించుకోవడం లేదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సహా బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అనేకసార్లు గృహనిర్బంధం చేస్తూ.. గొంతు నొక్కుతున్నారని తెలిపారు. కాంగ్రెస్.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక రకంగా.. లేనిచోట మరో రకంగా వ్యవహరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఖర్గే వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశ ప్రజాస్వామ్యాన్ని మదర్ ఆఫ్ డెమొక్రసీ కాదని, మజిల్డ్ డెమోక్రసీ(నిర్బంధ ప్రజాస్వామ్యం) అని సంబోధిస్తూ ట్వీట్ చేశారని, అధికారాన్ని అందుకోలేక పోతున్నామని ఆవేదనతో, ప్రజలు ఆదరించడం లేదనే ఆక్రోషంతో మల్లికార్జున ఖర్గే.. ఏకంగా ప్రజాస్వామ్యాన్నే నిందిస్తున్నారని కిషన్ రెడ్డి ఫైరయ్యారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ప్రజా హక్కులను కాలరాసి, పత్రికా స్వేచ్ఛ హరించి, లక్షలాది ప్రజా నాయకులను నిర్బంధించి ప్జాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రస్ పార్టీయేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: దీప్కే డ్రామాకు సీసీటీవీ చెక్.. అబద్ధాన్ని ఇట్టే బయటపెట్టిన ఢిల్లీ పోలీసులు!