Kalvakuntla Kavitha: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ (CAG) విడుదల చేసిన 2024-25 నివేదికను ఉటంకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సంపద పెంచుతాం.. పేదలకు పంచుతామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. రోజువారీ కనీస ఖర్చుల కోసం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద చేయి చాచాల్సిన దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని ఆమె మండిపడ్డారు.
కాగ్ నివేదికలో వెల్లడైన అంశాలు తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి అద్దం పడుతున్నాయని కవిత పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం రెండు రోజులు మినహా, మిగిలిన అన్ని రోజులు ఆర్బీఐ నుంచి చేబదులు తెచ్చి ప్రభుత్వం నడపడం సిగ్గుచేటని అన్నారు. ఏడాది కాలంలో సుమారు రూ. 1.30 లక్షల కోట్లు చేబదులు అప్పులు తెచ్చారంటే అది ప్రభుత్వ చేతకానితనమేనని విమర్శించారు. నెలకు రూ. 12 వేల కోట్ల సొంత ఆదాయం ఉన్నప్పటికీ, రోజువారీ కనీస అవసరాల కోసం కావాల్సిన రూ. 1.38 కోట్ల బ్యాలెన్స్ కూడా మెయింటెన్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. తెచ్చిన అప్పుల్లో మరో రూ. 6 వేలు కోట్లు ఆర్థిక సంవత్సరం ముగిసినా చెల్లించలేదని కాగ్ బట్టబయలు చేసిందని ఆమె గుర్తు చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అడ్డగోలుగా రూ. 8.65 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, దీనివల్ల ప్రతి కుటుంబంపై దాదాపు రూ. 9 లక్షల అప్పు భారం పడిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో ఉండి కూడా, ఇంకా “మిగులు బడ్జెట్” అని చెప్పుకుంటూ ప్రజలను పచ్చి దగా చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితం కాకుండా, ఇప్పటికైనా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా ప్రభుత్వం వాస్తవిక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక విధ్వంసం కాగ్ నివేదికతో బహిర్గతమైందని ఆమె స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, మామిడి పంటలు నేలరాలాయని చెప్పారు. అలాగే నువ్వులు, పసుపు, వరి పంటలకు తీరని నష్టం వాటిల్లిందని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే పంట నష్టం అంచనా వేసి, బాధితులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: నేలపాలైన పంటలు.. కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు, ప్రభుత్వం ఆదుకోవాలని కవిత డిమాండ్