Shamirpet Accident: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు చింతలపల్లి సమీపంలోని నాగిశెట్టిపల్లి కోళ్ల ఫారాల వద్ద వేగంగా వచ్చిన ఒక పారిశ్రామిక వ్యర్థాల వాహనం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ భయానక ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన బైకర్లు
ఈ ఘోర ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను ఢీకొట్టిన అనంతరం ఆ వాహనం నియంత్రణ కోల్పోయి సమీపంలోని కరెంట్ పోల్‌ను బలంగా గుద్దింది. ఈ ధాటికి లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమవ్వడమే కాకుండా, వాహనం టైర్లు కూడా ఊడిపోయాయి. ప్రమాద తీవ్రతను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
రంగంలోకి పోలీసులు.. డ్రైవర్, క్లీనర్ అదుపులోకి
సమాచారం అందుకున్న శామీర్‌పేట పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేసు నమోదు..
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి పూర్తి వివరాలు, అలాగే ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
Also Read: బాలకృష్ణ పీఏ ఎంట్రీతో రాజుకున్న వివాదం.. హిందూపురం కౌంటింగ్ సెంటర్ వద్ద రచ్చ రచ్చ!