Rice Silos: ధాన్యం నూర్పిడి పూర్తవ్వగానే మార్కెట్‌కు పరిగెత్తాల్సిన పని ఇక రైతుకు ఉండకపోవచ్చు. కోత పూర్తయిన 24 గంటల్లోనే, తేమ నెపంతో వ్యాపారులు అడిగిన ధరకు పంటను తెగనమ్ముకునే పరిస్థితికి చెక్ పెట్టేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక ‘సైలో’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష జరిపారు.
అన్నీ ఒకే ప్రాంగణంలోనే!
సైలో కేంద్రానికి ధాన్యం రాగానే తూకం వేయడం, తేమ శాతాన్ని సరిచూడటం, మలినాలను తొలగించడం, చివరగా డ్రయర్ల సాయంతో ఆరబెట్టడం.. ఇవన్నీ ఒకే చోట శరవేగంగా జరుగుతాయి. సాధారణంగా నూర్పిడి సమయంలో వరిలో 25 శాతం వరకు తేమ ఉంటుంది. దీనివల్ల క్వింటాలు రూ.3,500 దాటడం కష్టం. అదే సైలోలలో సైంటిఫిక్ పద్ధతిలో ఆరబెట్టి తేమను 12 శాతానికి తగ్గిస్తే, అదే ధాన్యానికి రూ.5,000 నుండి రూ.5,500 వరకు లభించే అవకాశముంది. గోనె సంచుల తిప్పలు లేకపోవడం, పురుగుల బెడద లేకుండా నిల్వ చేసుకునే వీలుండడం విశేషం.
రెండు నమూనాల్లో ఏర్పాటు
ఈ సైలోలను రెండు పద్ధతుల్లో నిర్మించనున్నారు. మొదటిది పౌర సరఫరాల సంస్థ నేరుగా రుణాలు సమీకరించి ఏర్పాటు చేయడం. రెండోది ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) తొలిదశలో 20 ముఖ్య ప్రాంతాల్లో నిర్మించడం. పెట్టుబడిదారులకు అద్దె హామీ ఇవ్వడం ద్వారా ప్రోత్సహించాలని యోచిస్తున్నారు.
ఆర్థిక రంగానికి ఊతం
తెలంగాణ వరి రకాలైన JSR, RNR, HMT లకు దేశ విదేశాల్లో విశేష ఆదరణ ఉంది. కొన్ని చోట్ల JSR బియ్యం బాస్మతి కంటే ఎక్కువ ధర పలుకుతోంది. ఇలాంటి ప్రీమియం రకాలను భద్రపరిచి, మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు రైతుకు లభిస్తే.. వారి ఆదాయం పెరగడమే కాదు, రాష్ట్ర జీడీపీ వృద్ధి చెంది 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి కూడా బలం చేకూరుతుంది.
Also Read: ఎవరీ వైఎస్ అనిల్ రెడ్డి? దేశవ్యాప్తంగా ఆయన పేరే ఎందుకు మారుమోగుతోంది?