Electricity Compensation: స్వేచ్ఛ బ్యూరో: విద్యుత్ సరఫరాలో అంతరాయం, కొత్త కనెక్షన్లు, మీటర్ల మార్పు.. ఇలా విద్యుత్ సేవలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే వినియోగదారులు ఇకపై పరిహారం పొందే అవకాశం ఉంది. అయితే ఇందుకు నిర్ణీత గడువులోగా సేవలు అందకపోవడంతోపాటు, ఫిర్యాదు చేసినట్లు రశీదు తప్పనిసరిగా ఉండాలి. వినియోగదారుల సమస్యలను నిర్దేశిత సమయంలో పరిష్కరించేందుకు ఎస్పీడీసీఎల్ మూడంచెల ఫిర్యాదుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సంస్థ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ వినియోగదారులకు పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలను నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించేందుకు తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) కట్టుబడి ఉందని సంస్థ తెలిపింది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు, మీటర్ల సమస్యలు, బిల్లింగ్ ఫిర్యాదులు, కొత్త కనెక్షన్లు తదితర సేవలకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీ ఈఆర్సీ) నిర్దేశించిన సేవా ప్రమాణాల ప్రకారం గడువులు అమల్లో ఉన్నాయని పేర్కొంది.
షెడ్యూల్డ్ విద్యుత్ అంతరాయాలకు ముందస్తుగా 24 గంటల సమాచారం అందించాలి. ఒకేసారి అంతరాయం 12 గంటలకు మించకూడదు. అలాగే సంస్థ లోపం కారణంగా కాలిపోయిన మీటర్‌ను ఏడు రోజుల్లో మార్చాలి. బిల్లింగ్ ఫిర్యాదులు, అదనపు సమాచారం అవసరం లేని ఫిర్యాదులను 24 పనిగంటల్లో పరిష్కరించాలి. ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్ ద్వారా కనెక్షన్ ఇవ్వగలిగిన సందర్భాల్లో అవసరమైన చెల్లింపుల అనంతరం 30 రోజుల్లోపు కనెక్షన్ విడుదల చేయాలని సంస్థ స్పష్టంచేసింది.
Also Read: గుండె నిండా గుడిగంటలు మనోజ్ నెల సంపాదన ఎంతో తెలుసా?
వినియోగదారులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు మూడంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అందుబాటులో ఉందని సంస్థ చెబుతోంది. మొదటి స్థాయిలో విద్యుత్ సరఫరా, బిల్లింగ్, మీటర్లు, కొత్త కనెక్షన్లు తదితర సమస్యలపై వినియోగదారులు టోల్‌ఫ్రీ నంబర్ 1912, అధికారిక వెబ్‌సైట్, ఆన్‌లైన్ పోర్టల్, వినియోగదారుల సేవా కేంద్రాలు లేదా స్థానిక విద్యుత్ కార్యాలయాల ద్వారా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. ఫిర్యాదు నమోదు చేసిన అనంతరం వచ్చే రశీదు సంఖ్యను భద్రపరచుకోవాలి. రెండో స్థాయిలో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్) ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
మొదటి(ఎస్పీడీసీఎల్) స్థాయిలో ఫిర్యాదు పరిష్కారం కాకపోతే సంబంధిత సీజీఆర్ఎఫ్ ను సంప్రదించవచ్చు. సీజీఆర్ఎఫ్-I పరిధిలోకి గద్వాల, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. సీజీఆర్ఎఫ్-II పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఇదిలాఉండగా మూడో స్థాయిలో విద్యుత్ అంబుడ్స్‌మన్ ఉంటుంది. సీజీఆర్ఎఫ్ ఇచ్చిన నిర్ణయంపై అసంతృప్తి ఉన్నా లేదా నిర్ణీత గడువులో ఫిర్యాదుపై నిర్ణయం వెలువడకపోయినా, వర్తించే నిబంధనలు, కాలపరిమితులకు అనుగుణంగా విద్యుత్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. ఇందుకు సంబంధించి టీజీఈఆర్సీ నిర్దేశించిన విధానాన్ని అనుసరించాలి. సాధారణ విద్యుత్ బిల్లులు, సరఫరా అంతరాయాలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి నేరుగా అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ(ఏపీటీఈఎల్)ను సంప్రదించాల్సిన అవసరం లేదని, అది ప్రధానంగా నియంత్రణ మండలి ఉత్తర్వులపై అప్పీళ్లను విచారించే సంస్థ అని ఎస్పీడీసీఎల్ స్పష్టం చేసింది.
విద్యుత్ నియంత్రణ మండలి రెగ్యులేషన్ 5 ప్రకారం.., నిర్దేశించిన సేవా ప్రమాణాలను పాటించని సందర్భాల్లో సంబంధిత నిబంధనలు, అర్హతలకు లోబడి వినియోగదారులు పరిహారం కోరవచ్చని సంస్థ స్పష్టంచేసింది. అయితే పరిహారం ప్రతి ఫిర్యాదుకు స్వయంచాలకంగా వర్తించదని, వినియోగదారులు ఫిర్యాదు రశీదు సంఖ్య, సంబంధిత ఆధారాలతో నిర్దేశించిన విధానంలో క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ సేవలకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారులు ఆందోళన చెందకుండా ముందుగా 1912కు ఫిర్యాదు నమోదు చేసుకుని, ఫిర్యాదు సంఖ్యను భద్రపరచుకోవాలని ఎస్పీడీసీఎల్ సూచించింది. నిర్ణీత గడువులో సమస్య పరిష్కారం కాకపోతే మూడు అంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను వినియోగించుకోవాలని కోరింది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడం, ఫిర్యాదులను పారదర్శకంగా పరిష్కరించడం ఎస్పీడీసీఎల్ లక్ష్యమని సంస్థ పేర్కొంది.
Also Read: బియ్యం వ్యాపారులకు ప్రభుత్వం బిగ్ షాక్.. ఇకపై అలా చేస్తే జైలుకే..?