Mahalakshmi Foundation: ఆడపిల్ల పుడితే ఆ ఊరిలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఏకంగా మహాలక్ష్మి పుట్టిందని ఆనందిస్తారు తల్లిదండ్రులు. అంతేకాదు ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. ఊరంతా సంబరమే. ఇక తమ గ్రామానికి చెందిన ఆడపిల్ల పెళ్లి.. ఊరు ఊరంతా సంబరంగా నిర్వహిస్తారు. నేటి సమాజంలో ఆడపిల్లను మహాలక్ష్మిలా భావించి, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న గ్రామమిది. వీరిలో వచ్చిన చైతన్యం అంతటా వస్తే చాలు అంటారు గ్రామస్తులు. ఇంతలా అందరినీ ఆలోచింపజేస్తున్న గ్రామం ఎక్కడుందో తెలుసా.. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో.. ఆగ్రామమే కొండయ్యపల్లి.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లి. ఇది పచ్చని చెట్లతో నిండి, పూర్తిగా గ్రామీణ వాతావరణంలో ఉండే ఒక మారుమూల గ్రామం. ఇక్కడ పెంటయ్య అనే దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెంటయ్య చేనేత పని చేస్తూ కుటుంబ పోషణ సాగించేవారు. బ్రతుకుదెరువు కోసం భీవండికి వెళ్లిన ఆయన, ఏనాడు ఒక్క రూపాయి కూడా ఇంటికి పంపలేదు. పెద్ద బిడ్డకు పెళ్లిఈడు వచ్చినా, ఆ బిడ్డకి పెండ్లి చేయాలని కబురు పంపినా ఎటువంటి స్పందన లేదు. అప్పుడే కొండయ్యపల్లి గ్రామమంతా ఒక్కటైంది. ఊరివారంతా రూ. 40 వేలు జమచేసి పెండ్లి చేసి ఆ అమ్మాయిని సాగనంపారు. అప్పుడే ఆ గ్రామంలో చైతన్యం వచ్చింది.
గ్రామంలోని ఎన్నారై రేండ్ల శ్రీనివాస్, యువకులంతా ఆలోచించి తమ ఊరులోని ఏ ఆడబిడ్డకి ఇలాంటి కష్టం రావద్దని అనుకున్నారు. గ్రామంలోని ఆడబిడ్డలని ఏ ఒక్క తల్లిదండ్రులు భారంగా భావించవద్దని, ఆడబిడ్డ పెండ్లీడు వచ్చే సరికి గ్రామం ఏదో ఒకటి ఇవ్వాలని కంకణం కట్టుకొని బాసటగా నిలిచేందుకు మాఊరు మహాలక్ష్మి పౌండేషన్ ఏర్పాటు చేశారు. 2018 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ రోజున ఎన్నారై రేండ్ల శ్రీనివాస్, గ్రామస్థులు అంతా కలిసి మా ఊరు మహాలక్ష్మి ఫౌండేషన్ కి పునాది వేశారు.
గ్రామంలోని అంగన్వాడి టీచర్ గోవిందమ్మ ప్రెసిడెంట్ గా, సర్పంచ్, గ్రామస్థులను మెంబర్స్ గా మాఊరు మాహాలక్ష్మీ పౌండేషన్ లో భాగస్వామ్యం అయ్యారు. ఇప్పటి వరకి 7 సంవత్సరాలుగా 60 మంది ఆడబిడ్డలకి, తల్లిదండ్రులను కోల్పోయిన మరో 15 మందికి మొత్తం 75 మంది ఆడబిడ్డలకి అండగా నిలిచి వారి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేసారు.
మా ఊరు మహాలక్ష్మి పౌండేషన్ ఏర్పాటు సమయంలో, 10 మంది ఆడబిడ్డలు పుట్టడంతో గ్రామస్థులు, ఎన్నారై ల సహకారంతో గ్రామం తరుపున రూ.5 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసారు. ప్రతి సంవత్సరం కూడ ఆడబిడ్డలకి మాఊరు మాహలక్ష్మీ ఫౌండేషన్ ద్వారా, అందరి సమక్షంలో పండుగ వాతావరణం లో పోస్టాఫీసులో జమచేసిన ఫిక్స్డ్ బాండులు ప్రజాప్రతినిధులని పిలిచి తల్లిదండ్రులకు అందజేస్తారు. ఇప్పటికీ ఏడు సంవత్సరాలలలో గ్రామంలో పుట్టిన ఆడపిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడమే కాకుండా, తల్లిదండ్రులు కూడా ప్రతి సంవత్సరం రూ.1000లు పొదుపు చేసుకునేలా చైతన్యం తీసుకువచ్చింది ఫౌండేషన్.
గ్రామస్థులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే రూ.5000తో పాటుగా తల్లిదండ్రులు రూ.5000 కలిపి మొత్తం రూ.10000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఆడబిడ్డ పెండ్లీడుకు వచ్చే సమయానికి సుమారు రూ.130000 వరకు జమవుతుంది. గ్రామంలో పుట్టిన ఆడబిడ్డకి కన్న ఊరే ఒక మేనమామ లాగా అర్థిక సహాయం అందిస్తుందని, దీంతో పెళ్లి చేసే కుటుంబంకి భారం తగ్గిస్తుంది గ్రామం.
మా ఊరు మహాలక్ష్మి పౌండేషన్ సభ్యులంతా కలిసి గ్రామం నుండి అత్తావారింటికి సారే ఇచ్చి సాగనంపేలా కృషి చెయ్యాలన్న సదుద్దేశంతో మంచి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నేటి రోజుల్లో కూడా ఎంతో సేవాభావం చాటిచెబుతున్న ఈ గ్రామం ఎంతో ఆదర్శప్రాయం. అలాగే ఒక్క ఆడపిల్లతో మొదలై, నేడు ఎందరో ఆడపిల్లలకు బాసటగా నిలుస్తున్న ఆగ్రామస్థులను అభినందించాల్సిందే.