Karimnagar Mystery Deaths: వింత పక్షి. భయంకరమైన అరుపు. కూత పెట్టిందో శవం లేవాల్సిందే! అర్థరాత్రి, చిమ్మ చీకటి.. చెట్టు మీద పక్షికూత. తెల్లవారగానే చావు కబురు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 40 రోజుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఊరి జనాల్లో భయం. ఏ రాత్రి పక్షి కూత వినిపిస్తుందోననే వణుకు. ఇంతకీ ఆ గ్రామస్తులు భయం పోగొట్టుకునేందుకు ఏం చేశారు? ఊళ్లో పక్షి కూత ఆగిందా? ప్రజల ప్రాణాలు నిలబడ్డాయా? ఇంతకీ ఆ ఊరిలో ఏం జరుగుతోంది?
జమ్మికుంటలో వరుస మరణాలు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్. ఇప్పుడు ఈ ఊరిపేరు వింటేనే వెన్నులో వణుకుపడుతుంది. గత కొద్ది రోజులుగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. 40 రోజుల్లో ఏకంగా 14 మంది ప్రాణాలు విడిచారు. చిన్న ఊరిలో ఇంత మంచి చనిపోవడం ఏంటనే భయం మొదలయ్యింది. ఊరంతా వ్యాపించింది. ఓ వ్యక్తి చనిపోయి దిన కర్మలు చేయక ముందే మరో వ్యక్తి చనిపోవడంతో ప్రజల్లో ఆందోళన ఆవహించింది. ఏ మనిషిలో చూసినా భయమే. ఎప్పుడు.. ఎవరు.. ఎలా చనిపోతారో తెలియని పరిస్థితి. ఎలాగైనా ఈ చావులు ఆపాలి? ఇందుకోసం ఏం చేయాలి? అని ఊరి పెద్దలు బోడ్రాయి దగ్గర సమావేశమయ్యారు. మూకుమ్మడిగా ఓ నిర్ణయం తీసుకున్నారు.
ఊరికి కీడు వచ్చిందన్న పెద్దలు
పెద్దలంతా ఒక్కచోట చేరి ఊరికి కీడు వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. కీడు పోవాలంటే.. ఒక్కరోజు ఊరిని విడిచిపెట్టి వనవాసం వెళ్లాలని నిర్ణయించారు. పెద్దల నిర్ణయం ప్రకారం.. తాజాగా ఉదయం6 గంటలకే.. ఊళ్లో వాళ్లంతా ఇళ్లకు తాళాలు వేశారు. వంట సమాన్లు సర్గుకుని బావుల దగ్గరికి వెళ్లిపోయారు. ఊళ్లో పిల్ల లేకుండా మానేరు పరివాహ ప్రాంతానికి వెళ్లారు. అంతా అక్కడే వంటలు చేసుకుని తిన్నారు. సాయంత్రం చీకటి పడ్డాక మళ్లీ గ్రామంలోకి అడుగు పెట్టారు. కీడు పోయిందని అందరూ భావించారు. ఇప్పటికైనా ఆ గ్రామంలో చావులు ఆగుతాయో? లేదో? చూడాలి.
పక్షి కూతల తర్వాతే చావులు మొదలు
గ్రామాస్తులు చెప్పిన దాని ప్రకాం.. సుమారు 40 రోజుల క్రితం రెండు వింత పక్షలు ఊళ్లోకి అడుగు పెట్టాయి. అదే రాత్రి చెట్టు మీద నుంచి వింత శబ్దాలు చేశాయి. ఆ తర్వాతి రోజు నుంచి చావులు మొదలయ్యాయి. ఈ పక్షి కూతే ఊరికి కీడును తీసుకొచ్చిందని గ్రామస్తలు భావిస్తున్నారు.
అవన్నీ మూఢ నమ్మకాలేనా?
పక్షుల కూతే ప్రాణాలు తీస్తోందనే వాదనను హేతువాదులు తప్పుబడుతున్నారు. అవన్నీ కేవలం మూఢ నమ్మకాలుగా కొట్టి పారేస్తున్నారు. ఆయా కారణాలతోనే ఇప్పటి వరకు చనిపోయారని చెప్తున్నారు. అన్నీ సహజ మరణాలే అంటున్నారు. ఎవరూ, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదంటున్నారు. గ్రామస్తులకు అవగాహన కల్పించి, వారిలోని భయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తామంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ మిస్టరీ మరణాల విషయంలో జోక్యం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. వారిలోని భయాలను తొలగించి, అసలు నిజాలను వెలికి తీయాలంటున్నారు. కారణాలు ఏవైనా విలాసాగర్ గ్రామస్తులు గత నెల రోజులుగా భయం గుప్పిట బతుకీడుస్తున్నారు. ఎప్పుడు ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని వణికిపోతున్నారు. తాజాగా ఊరి జనాలంతా వనవాసం వెళ్లడంతో గ్రామం నిర్మానుష్యంగా మారిపోయింది.
Read Also: కారు ఢీకొని.. తలకిందులుగా వేలాడిన మహిళ, వీడియో వైరల్!