రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మూసీ నది ప్రక్షాళన అంశం హాట్ టాపిక్ గా మారింది. నార్సింగి పరిధిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గళమెత్తారు. స్థానికులతో కలిసి ఆమె చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి భారీ ఎత్తున ధర్నాకు దిగిన కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులతో కలిసి కవిత ధర్నా
హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించిన కవిత
కవితతో పాటు పలువురు జాగృతి… https://t.co/dvdyioM2Bm pic.twitter.com/6DQY15Rieu
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2026
నార్సింగిలోని శ్రీ ఆదిత్య లగ్జరీ అపార్ట్‌మెంట్స్ వద్ద చేపట్టిన ఈ నిరసనలో కవిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేస్తూ భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నా హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం సామాన్య ప్రజల నివాసాలను కూల్చివేసేందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. బడా రియల్ ఎస్టేట్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తుంటే అధికారులు కళ్లు మూసుకున్నారా అంటూ నిలదీశారు.
ధర్నా సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ తీరు పక్షపాతంగా ఉందని మండిపడ్డారు. పేదల గూడును నేలమట్టం చేసే హైడ్రాకు ఈ భారీ నిర్మాణాలు కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. ఒకవైపు నిరుపేదల ఇళ్లను మార్కింగ్ చేస్తూ భయాందోళనకు గురిచేస్తూ.. మరోవైపు రియల్ ఎస్టేట్ మాఫియాకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని విమర్శించారు. అక్రమంగా నిర్మిస్తున్న ఈ భవనాల వద్దకు హైడ్రా బుల్డోజర్లు వచ్చే వరకు తాను కదిలేది లేదని అక్కడే బైఠాయించారు.
కవిత మోచేతికి గాయం..
కవిత పిలుపుతో తెలంగాణ జాగృతి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ధర్నాను విరమించాలని కోరినప్పటికీ కవిత ససేమిరా అనడంతో ఆమెను అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ చేసే సమయంలో కవిత మోచేతికి గాయమైంది. ఆమెతో పాటు పలువురు జాగృతి నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కవిత ఫైరయ్యారు. మూసీ సుందరీకరణ పేరుతో జరుగుతున్న ఈ డ్రామా వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కేవలం పేదలను వేధించడమే లక్ష్యంగా పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్సింగి ఘటనతో మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వ వివక్షపై జనం గొంతు ఎత్తుతున్నారు. అక్రమ కట్టడాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని ఎండగడుతున్నారు.
హైడ్రా వ్యవస్థ పేదవారిని లక్ష్యంగా చేసుకుని, ధనవంతులకు కొమ్ముకాస్తోందని కవిత మండిపడ్డారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా సెలవు రోజున తాము చేపట్టిన శాంతియుత నిరసనను ప్రభుత్వం అక్రమంగా అడ్డుకుందని ఆమె విమర్శించారు. రంగనాథ్ వంటి సిన్సియర్ ఆఫీసర్ నుంచి పారదర్శకతను ఆశించామని, కానీ ప్రభుత్వం భారీ పోలీస్ ఫోర్స్‌ను ఉపయోగించి తమను అక్రమంగా అరెస్ట్ చేయడం దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు.
పేదవారి ఇళ్లను ముందస్తు సమాచారం లేకుండా కూలగొడుతున్న ప్రభుత్వం, పెద్దవారి అక్రమ నిర్మాణాల విషయంలో మాత్రం కళ్లు మూసుకుంటోందని కవిత ఆరోపించారు. ఈ అన్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పులుల్లా పోరాడిన తన జాగృతి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే వరకు లీగల్ గా, క్షేత్రస్థాయిలో పోరాటం ఆపేది లేదని ఆమె స్పష్టం చేశారు.