Big Stories

CM KCR: అలర్ట్ అయ్యారా? కంగారు పడుతున్నారా?.. కేసీఆర్ స్కెచ్ ఏంటి?

CM KCR: మునుగోడు ఎలక్షన్ తర్వాత.. గులాబీ బాస్ ఇక బీఆర్ఎస్ పై ఫుల్ ఫోకస్ చేస్తారని అనుకున్నారు. నేషనల్ పాలిటిక్సే ఆయన మెయిన్ ప్రయారిటీ అని భావించారు. కానీ, జరుగుతున్నది వేరు. తెలంగాణలో పార్టీ బలోపేతం మీద దృష్టి సారిస్తూ.. మరీ ముఖ్యంగా యాంటీ బీజేపీ వ్యూహాలు రెడీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టి.. ఎమ్మెల్యేలను అలర్ట్ చేసి.. వచ్చే ఏడాది పాటు ప్రజల్లోనే ఉండాలంటూ ఆదేశించడం ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

కేసీఆర్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారమైతే ఉంది. ఆ మేరకు సర్వే రిపోర్టులు సైతం ఆయన టేబుల్ మీద ఉన్నాయని తెలుస్తోంది. ఇలాగైతే కుదరదనుకున్నారో ఏమో.. గెలుపే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజాబాట పట్టిస్తున్నారు. సిట్టింగులకే ఛాన్స్ అంటూ ఆశ కల్పిస్తూనే.. పని తీరు సరిగా లేకపోతే యాక్షన్ తప్పదంటూ వార్నింగులు కూడా ఇచ్చారు. నేతలెవరూ పార్టీ వీడకుండా.. బీజేపీ గాలానికి చిక్కకుండా.. కవిత ప్రస్తావన చేయడం కూడా.. అంతా వ్యూహాత్మకమే అంటున్నారు.

- Advertisement -

సీఎంగా కేసీఆర్ మరో ఆసక్తికరమైన రివ్యూ కూడా చేశారు. తెలంగాణలో రోడ్లన్నీ అద్దంలా మెరవాలని.. పాడైన రహదారులను ఎప్పటికప్పుడు రిపేర్లు చేయించాలంటూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఇలా ప్రజా సమస్యలపై సమావేశం పెట్టడం ఈ మధ్య కాలంలో అరుదైన విషయమే అంటున్నారు. మరోవైపు, జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని సైతం ప్రారంభించనుంది ప్రభుత్వం. ఇలా, ఎన్నికల నాటికి ఒక్కో పబ్లిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్లేలా.. కేసీఆర్ యాక్షన్ ప్లాన్ కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఇక, కొత్త సచివాలయ నిర్మాణాన్ని మరోసారి పరిశీలించారు ముఖ్యమంత్రి. పనులు 90శాతం పూర్తైనట్టు చెబుతున్నారు. వీలైతే సంక్రాంతికే సెక్రటేరియేట్ బిల్డింగ్ ను స్టార్ట్ చేసేలా ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి అంటూ ఎనిమిదేళ్లుగా తనపై వస్తున్న విమర్శలకు త్వరలోనే చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన మోదీ సైతం.. మూఢనమ్మకాల ప్రభుత్వం అంటూ పరోక్షంగా కేసీఆర్ పై విమర్శలు చేయడం.. మోదీ పర్యటన జరిగిన వారంలోపే సీఎం సచివాలయ పనులు పరిశీలించడం యాధృచ్చికం కాకపోవచ్చని అంటున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించకుండా వారిని కాపాడుకుంటూ.. ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి భగ్గుమనకుండా సమస్యలు పరిష్కరించుకుంటూ.. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టుకుంటూ.. వచ్చే పది నెలల కాలం పూర్తిగా తెలంగాణ రాజకీయాలపైనే కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇదంతా కంగారు వల్లా? లేదంటే, యాక్టివ్ అయ్యారా? అనే అనుమానమూ లేకపోలేదు. ఇలా, బీఆర్ఎస్ పేరుతో ఢిల్లీకి రాకుండా.. గులాబీ బాస్ ను తెలంగాణకే కట్టడి చేసేలా.. ఆయనకు రాష్ట్రంలో రాజకీయ అత్యవసర పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నంలో కమలనాథులు బాగానే సక్సెస్ అయ్యారని చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News