రాజకీయాల్లో ఏవీ అసాధ్యం కాదు, అలాగని సంచలనాలన్నీ నిజమైపోవు. అయితే ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ-బీఆర్ఎస్ బంధంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత జైలులో ఉన్నప్పుడు బీఆర్ఎస్, బీజేపీ విలీనానికి సంబంధించి చర్చలు జరిగినట్టు పార్టీ నేతలే చెబుతున్నారు. స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా మరోసారి ఇదే చర్చ మొదలైంది. ఉపరాష్ట్రపతి పదవికి జగ్ దీప్ దన్ ఖడ్ అనూహ్య రాజీనామా అనంతరం మరోసారి బీజేపీ-బీఆర్ఎస్ బంధంపై ఊహాగానాలు మొదలయ్యాయి. కేసీఆర్ ని ఉపరాష్ట్రపతిగా చేస్తున్నారని, కేంద్ర కేబినెట్ లోకి కవితను తీసుకుంటున్నారని. దీనికి ప్రతిఫలంగా తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని, లేదా పొత్తు పెట్టుకుంటుందని వార్తలొచ్చాయి. ఈ వార్తలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు.
కేసీఆర్ శకం ముగిసింది..
రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందని అన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. తెలంగాణలో బీఆర్ఎస్ కి ఓటు ఎవరూ వేయరని తేల్చి చెప్పారు. కేసీఆర్ కుటుంబమే ఆ పార్టీని నాశనం చేసిందన్నారు. కేటీఆర్, కవిత నాయకత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదన్నారు. కేసీఆర్ యాక్టివ్ గా ఉన్నన్ని రోజులు మంచి, మర్యాద ఉంటుందని, ఆయన తర్వాత కేటీఆర్, కవితని ఎవరూ పట్టించుకోరన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. గతంలో బీఆర్ఎస్ కి ఓట్లు వేసిన సెటిలర్లు ఈ సారి బీజేపీవైపు చూస్తున్నారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టుపక్కల బీజేపీ సత్తా చూపిస్తామన్నారు అర్వింద్.
నవ్వొచ్చింది..
కేసీఆర్ ని ఉపరాష్ట్రపతిగా చేసి, కవితను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారంటూ వస్తున్న ఊహాగానాలపై కూడా ఎంపీ అర్వింద్ స్పందించారు. ఆ వార్తలు చూసి తనకు నవ్వొచ్చిందని అన్నారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. అయితే విలీనాన్ని మాత్రం కొట్టిపారేయలేమన్నారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుటుంబం మినహా ఇంకెవరు వచ్చినా బీజేపీలోకి తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, కవిత.. మోసాలపై అక్రమాలపై తాము పోరాటం చేస్తున్నామని వారిని మాత్రం బీజేపీలోకి తీసుకునేది లేదని అన్నారు అర్వింద్. కేసీఆర్ పై కానీ, ఆయన కుటుంబ సభ్యులపై కానీ బీజేపీ ఎప్పటికీ సింపతీ చూపించబోదని చెప్పారు అర్వింద్. ఇక ఉపరాష్ట్రపతి పదవి విషయంలో వారం పదిరోజుల్లో క్లారిటీ వచ్చేస్తుందని అన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ మరింత హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కి పరిమితం కావడం, అసెంబ్లీకి మొహం చాటేయడం, విమర్శలు వచ్చినప్పుడల్లా నేతల్ని ఫామ్ హౌస్ కి పిలిపించి మీటింగ్ పెట్టడంతో ఆ పార్టీలో రాజకీయ శూన్యత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో కేటీఆర్, కవిత మధ్య జరుగుతున్న వారసత్వ యుద్ధం కూడా పార్టీని రెండు ముక్కలుగా చేసింది. ఓవైపు కేటీఆర్, ఆయనకు మద్దతుగా హరీష్ ఉన్నారు. మరోవైపు కవిత, జాగృతి పేరుతో తనదారి తాను చూసుకుంది. ఈ ఇద్దరిలో ఎవరికి తన ఆశీస్సులున్నాయో చెప్పకుండా కేసీఆర్ తాత్సారం చేస్తున్నారు. ఒకరకంగా ఆయన కొడుకునే దగ్గరకు తీస్తున్నారు. ఈ దశలో బీఆర్ఎస్ ముక్కలు చెక్కలు కావడం ఖాయంగా కనపడుతోంది. దీంతో తెలంగాణలో ఆ పార్టీ మూడో స్థానానికి పడిపోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.