Trainee IPS Case: ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి మరో చిక్కు ఎదురైంది. ఈ వ్యవహారంలో ఆయన సోదరుడి పాత్ర కూడా బయటపడటంతో పోలీసులు అతడిని కేసులో నిందితుడిగా చేర్చారు. కీలక ఆధారాలను దాచిపెట్టడంతో పాటు, ప్రధాన నిందితుడికి సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఆధారాలు దాచిపెట్టినట్లు ఆరోపణలు
ఉదయ్ కృష్ణారెడ్డి రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్ అసలు కాపీతో పాటు, బాధితురాలికి సంబంధించిన వీడియోలు ఉన్న ఐఫోన్‌ను ఆయన సోదరుడు దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో ఈ ఫోన్, సూసైడ్ నోట్ కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉంది. దీంతో వాటిని దాచిపెట్టిన వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
వాట్సాప్ సందేశాల వెనుక సోదరుడి సహకారం
అంతేకాదు, ప్రధాన నిందితుడు వాట్సాప్ సందేశాలు పంపేందుకు అవసరమైన సిమ్ కార్డు, ఫోన్‌ను కూడా సోదరుడే సమకూర్చినట్లు దర్యాప్తులో తేలింది. వినియోగదారుడి అసలు గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరిణామంతో కేసులో సోదరుడి పాత్రపై మరింత స్పష్టత వచ్చినట్లయింది.
ఛార్జిషీట్ దిశగా దర్యాప్తు
గత జులై 18న వేధింపుల ఆరోపణలపై నమోదైన ఎఫ్ఐఆర్‌లో బాధితురాలితో పాటు మరో నలుగురు ట్రైనీ ఐపీఎస్ అధికారుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.
ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఛార్జిషీట్ దాఖలు..?
ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సోదరుడిని కూడా నిందితుడిగా చేర్చడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఛార్జిషీట్‌లో ఇంకా ఎలాంటి అంశాలు బయటకు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: పోలీస్ స్టేషన్‌లో కత్తితో దుండగుడి దాడి.. 9 మంది పోలీసులకు గాయాలు, చివరికి ఎలా చిక్కాడంటే?