KCR: పంచాయతీ ఫలతాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులతో కేసీఆర్ సమావేశమయ్యారు. సుమారు పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ కు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ భేటీలో కేసీఆర్ మాట్లాడుతూ… పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత స్పష్టమైందన్నారు. తనను దూషించడం, చనిపోవాలని శాపాలు పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఏవి పాలో, ఏవి నీళ్లో అర్థమైందన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని, తనపై వ్యక్తిగత విమర్శలు చేయడానికే సమయం ఇస్తోందని ఆక్షేపించారు. పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్ సత్తా తెలిసేదన్నారు. గర్వంతో మాట్లాడే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ అహంకార వైఖరి ప్రదర్శించలేదని చెప్పుకొచ్చారు. రెండేళ్లలో కాంగ్రెస్ ఒక్క కొత్త పాలసీ కూడా తేలేదన్నారు. కాంగ్రెస్ పాలసీ రియల్ ఎస్టేట్ కోసమే అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందని ఆరోపించారు. ఒకప్పుడు యూరియా ఇంటికి వచ్చేదని, ఇప్పుడు ఇంటిళ్లపాది లైన్లలో నిలబాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
తెలంగాణ సాగునీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కేసీఆర్ తప్పుబట్టారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై కాంగ్రెస్ సర్కార్ దిల్లీలో మోకరిల్లిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టు విషయంలో నీటి వాటాలపై రాజీపడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తది ఒక్క పథకం కూడా తీసుకురాలేదన్నారు.
Also Read: Kalvakuntla Kavitha: ప్రజా సమస్యల కోసమే జాగృతి జనం బాట: కవిత
నీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ మరోసారి జల ఉద్యమానికి సిద్ధమవుతోందని కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో త్వరలోనే భారీ బహిరంగ సభలకు కార్యాచరణ సిద్ధం చేయాలని నేతలకు సూచించారు. అలాగే పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి వరకు నియామకాలు చేపట్టాలన్నారు. వాయిదా పడుతూ వస్తున్న బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సిద్ధమవ్వాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.