KCR : అంతన్నారు. ఇంతన్నారు. వారాల తరబడి కసరత్తు చేశారు. మందీమార్బలంతో తరలివచ్చారు. BRK భవన్ ముందు బల ప్రదర్శన చేశారు. తనతో పాటు లోనికి 9 మంది వస్తారన్నారు. కేసీఆర్ అంటే మజాకా? ఆ మాత్రం హడావుడి ఉండాల్సిందే అనుకున్నారు. కమిషన్ ముందుకు వెళ్లాక సీన్ అంతా మారిపోయింది. తనకు హెల్త్ బాలేదని.. జలుబు చేసిందని.. తననొక్కడినే సింగిల్‌గా విచారించాలని కమిషన్‌ను కోరారు కేసీఆర్. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కావాలన్నారు. అదేంటి? జలుబు ఓ పెద్ద అనారోగ్యమా? అప్పటి వరకూ జరిగిన హంగామా ఏంటి? కేసీఆర్ రిక్వెస్ట్ ఏంటి? అనుకున్నారు అంతా.
బయట ప్రచారం.. లోపల..?
గులాబీ బాస్‌కు అప్పటికప్పుడే అనారోగ్యం వచ్చిందా? ముందునుంచే బాలేక పోతే.. తనతో పాటు 9 మంది లోనికి వచ్చేలా ఎందుకు పర్మిషన్ తీసుకున్నట్టు అనే అనుమానం వ్యక్తం అవుతోంది. సింగిల్‌గా ఎంక్వైరీ చేయించుకోవాలని ముందే ఫిక్స్ అయితే.. మరి, అన్నేసి కార్లు, అంతమంది నాయకులతో ఎందుకు హడావుడి చేసినట్టు? బయట మాత్రం ఫుల్ ప్రచారం కావాలి? లోపలి మేటర్ మాత్రం బయటకు రావొద్దనా? కేసీఆర్ రిక్వెస్ట్ వెనుక వ్యూహం దాగుందా? అనే చర్చ నడుస్తోంది.
దైవ సాక్షిగా.. ముగ్గురు మాత్రమే..
జస్టిస్ ఘోష్ మాత్రం కేసీఆర్ రిక్వెస్ట్‌ను కాదనలేక పోయారు. ఆయన కోరినట్టే ఏకంత విచారణకు అంగీకరించారు. నాయకులను, అధికారులను, సిబ్బందిని బయటకు పంపించేసి.. కమిషన్ హాల్‌లో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తో పాటు కమిషన్ కార్యదర్శి మురళీధర్.. కేసీఆర్.. మాత్రమే ఉన్నారు. దైవ సాక్షిగా భగవంతునిపై ప్రమాణం చేయించి కేసీఆర్ విచారణను ప్రారంభించి.. స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
50 నిమిషాల్లోనే..
కేసీఆర్‌తో ఇన్ కెమెరా ఎంక్వైరీ జరిగింది. 50 నిమిషాల్లోనే ఆ విచారణ ప్రక్రియ ముగిసింది. కేసీఆర్ బయటకు వచ్చి.. కారెక్కి ప్రజలకు అభివాదం చేసి వెళ్లిపోయారు. కమిషన్ ఆఫీసుకు వెళ్లేటప్పుడు నీరసంగా, కష్టంగా నడుస్తూ వెళ్లిన గులాబీ బాస్.. రిటర్న్‌లో వెళ్లిపోయేటప్పుడు మాత్రం హుషారుగా కనిపించారు. కారుపై నిలుచుని మరీ చేతులు ఊపుతూ పూర్తి ఆరోగ్యంగా, ఆనందంగా కనిపించారు. అంటే.. సింగిల్‌గా ఎంక్వైరీ కోసమే అంత డ్రామా చేశారా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఎందుకు? అసలెందుకు కేసీఆర్ ఏకాంత విచారణ కోరారు? అందరి ముందు విచారణ ఎందుకు ఎదుర్కోలేదు? కమిషన్ వేసే ప్రశ్నలతో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Also Read : అయ్యో కేసీఆర్.. అలా అయ్యారేంటి?
కేసీఆర్‌కు 18 ప్రశ్నలు..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముందే రెడీ చేసుకుని వచ్చిన బుక్ లెట్‌ను కమిషన్‌కు అందజేశారు కేసీఆర్. కమిషన్ 18 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీల నిర్మాణం కేబినెట్ అనుమతితో చేశారా? అంటే అవును అని కేసీఆర్ సమాధానం చెప్పారట. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై కమిషన్ ప్రశ్నించగా.. నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేశామని కేసీఆర్ అన్నారట. బ్యారేజీల్లో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారు అని అడగ్గా.. టెక్నికల్ అంశాల ఆధారంగా స్టోరేజ్ నిర్ణయం అధికారులు తీసుకున్నట్టు తెలిపారట. బ్యారేజీల లొకేషన్స్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని ప్రశ్నించగా.. టెక్నికల్ నివేదికల ఆధారంగా బ్యారేజీల లొకేషన్స్ మార్పులు జరిగాయని చెప్పినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతి అంశాన్ని కేబినెట్ అనుమతి ఉందని కేసీఆర్ చెప్పారని.. ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన లేఖలు, CWC లేఖలను కమిషన్‌కు ఇచ్చారని సమాచారం.