Faridabad Suicide Case: మనుషులు చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్ లో ఓ వ్యక్తి భార్య తరచుగా గొడవ పెట్టుకుంటుందనే కారణంగా తన నలుగురు పిల్లలతో కలిసి రైలు కింద పడి చనిపోయాడు. వేగంగా వస్తున్న రైలు వారి ఢీకొట్టడంతో మృత దేహాలు ముక్కలు ముక్కలై చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ ఘటన ఫరీదాబాద్ బల్లబ్ గడ్ సమీపంలో జరిగింది.
సొంతూరు బీహార్.. ఉండేది హర్యానా!
బీహార్ లోని సీతామర్హికి చెందిన మనోజ్ కుమార్(45), ఆయన భార్య ప్రియ(40) గత కొద్ది సంవత్సరాలుగా హర్యానాలోని ఫరీదాబాద్ సుభాష్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. భార్య నలుగురు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కుటుంబాన్ని పోషించేందుకు కూలీగా పని చేస్తున్నాడు. ఆయన ఇల్లు రైల్వే ట్రాక్ కు సమీపంలోనే ఉంటుంది. మంగళవారం నాడు మధ్యాహ్నం సమయంలో తన పిల్లలతో కలిసి రైలు కింది పడి చనిపోవాలని అనుకున్నాడు. పవన్(10) కరు(9), మురళీ(5), చోటు(3) తీసుకొని రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో మనోజ్ తన పిల్లలకు చిప్స్, కూల్ డ్రింక్స్ ఇప్పించాడు. వాటిని పిల్లలు ఎంతో సంతోషంగా తిని, తాగారు. అదే సమయంలో గోల్డెన్ టెంపుల్ మెయిల్ వచ్చింది. వెంటనే తన నలుగురు పిల్లలను తీసుకుని రైలుకు ఎదురుగా వెళ్లాడు. వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ముక్కలు సుమారు 100 మీటర్ల దూరంలో పడ్డాయి.
మనోజ్ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది?
మనోజ్ రోజూ కూలీకి వెళ్లి డబ్బులు సంపాదించేవాడు. ఆయన భార్య ఇంటి దగ్గర ఉండి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆయన అనుమానం ఉండేది. తరచుగా ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. మనోజ్ తన పిల్లలతో కలిసి చనిపోవడానికి ముందు కూడా ఆయన భార్యతో గొడవ పెట్టుకున్నట్లు చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. పిల్లలను పార్కుకు తీసుకెళ్తున్నానని భార్యకు చెప్పి, వారిని రైల్వే ట్రాక్‌ల వద్దకు తీసుకువచ్చి ఈ ఘోరానికి తెగించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు డెడ్ బాడీలను ఒక్కచోటికి చేర్చారు. మనోజ్ జేబులోని ఆధార్ కార్డు చూసి ఆయన భార్యకు ఫోన్ చేశారు. అక్కడి చేరుకుని విగత జీవులుగా పడి ఉన్న భర్త, పిల్లలను చూసి ఆమె కుప్పకూలిపోయింది. ఎవరూ లేని ఒంటరైన ప్రియను చూసి అందరూ కంటతడి పెట్టారు.
Read Also: తెలంగాణలో మరో రెండు ఎయిర్ పోర్టులు, అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?
పోస్టుమార్టం కోసం మృతదేహాల తరలింపు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను ఫరీదాబాద్ ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి. నిజానికి.. క్షణికావేశంలో మనోజ్ కుమార్ తీసుకున్న నిర్ణయం.. తనతో పాటు మరో నలుగురు ప్రాణాలను తీసింది.
Read Also: ప్రపంచంలో ఫాస్టెస్ట్ రైళ్లు ఇవే, ఒక్కోదాని వేగం చూస్తే కళ్లు తిరగాల్సిందే!