BRS Politics: ఉపరాష్ట్రపతి ఎన్నిక బీఆర్ఎస్‌కు కొత్త సమస్యను తీసుకొచ్చిందా? ఇండియా కూటమి అభ్యర్థికి కారు పార్టీ మద్దతు ఇస్తుందా? అనుహ్యంగా తెలంగాణ వ్యక్తిని నిలబెట్టేందుకు కారణమేంటి? ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? తెలంగాణ వ్యక్తికి మద్దతు ఇస్తారా? ఎన్డీయేకు మద్దతు ఇచ్చారా? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి.
రాజకీయాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకుంటే పార్టీ ఫినిష్ అవుతుంది. ఇప్పుడు అసలైన పరీక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎదురైంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక కారు పార్టీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నచందంగా మారింది. ఎందుకంటే ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది బీజేపీ.
ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతోంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్, ఇంకా చాలామందికి బీజేపీ పెద్దలు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. కాకపోతే ఆ విషయం బయటకు తెలీకుండా జాగ్రత్త పడినట్టు ఆ పార్టీ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.
ఈ వ్యవహారంపై మంగళవారం ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీలు భేటీ అయ్యాయి. తమిళనాడుకు చెందిన వ్యక్తిని నియమిస్తారంటూ తొలుత వార్తలు వచ్చాయి. కాకపోతే సీఎం స్టాలిన్ ఆ విషయంలో వెనక్కి తగ్గినట్టు తేలింది. ఈ క్రమంలో ఎవరైతే బాగుంటుందనే దానిపై పార్టీలో చర్చ జరిగింది. చివరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి బయటకు రావడం, కూటమి పార్టీలు ఓకే చేయడం, వెంటనే ప్రకటన రావడం చకచకా జరిగింది.
ALSO READ: చిక్కుల్లో యూట్యూబర్లు.. ఫిస్తా హౌస్ యజమాని ఫిర్యాదు
మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరు బయటకు రాగానే బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉన్నట్లుండి తెలంగాణకు చెందిన వ్యక్తిని ఎలా ఎంపిక చేశారంటూ చర్చించుకోవడం మొదలైంది. దీని వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ప్రమేయం ఉందని అంటున్నారు. లేకుంటే సడన్‌గా ఆయన పేరు తెరపైకి ఎలా వచ్చిందంటూ అప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు చర్చ మొదలైంది.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎటువైపు అడుగులు వేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. దీంతో బీఆర్ఎస్ లోగుట్టు బయటపడడం ఖాయమని అంటున్నారు. స్థానిక వ్యక్తికి బీఆర్ఎస్ సపోర్టు చేస్తుందా? ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తుందా? ఈ వ్యవహారం బీఆర్ఎస్‌కు మింగుడుపడడం లేదు.
ఇండియా అభ్యర్థికి మద్దతు ఇవ్వకుంటే బీఆర్ఎస్ పార్టీ నైజం బయటపడుతుందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఎందుకంటే స్థానిక వ్యక్తిని ఇండియా కూటమి ఎంపిక చేయడం ఆషామాషీ విషయం కాదని అంటున్నారు. మరి కేసీఆర్ మదిలో ఏముందో? దీనిపై రేపో మాపో పార్టీ నేతలతో సమావేశం కానున్నారట కేసీఆర్.
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు
1946 జూలై 8 జన్మించిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, గోవా మొదటి లోకాయుక్త చైర్మన్ పనిచేసిన సుదర్శన్ రెడ్డి
2007 జనవరి 12 నుండి 2011 జూలై 8 వరకు… pic.twitter.com/B5rhiOkmKE
— BIG TV Breaking News (@bigtvtelugu) August 19, 2025