Hyderabad News: నిజం తెలుసుకునే లోపు.. అబద్దం గుమ్మదాటి వెళ్లిపోతోంది. సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉన్న ఈ రోజుల్లో ఏమాత్రం ఆలస్యం చేసినా నిట్టనిలువునా మునిగిపోతారు. తాజాగా హైదరాబాద్‌లో పిస్తాహౌస్ పరిస్థితి అదే. ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాల నేపథ్యంలో కొంతమంది యూట్యూబర్లు కాసింత మసాలా జోడించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కస్టమర్ల సంఖ్య అమాంతంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పిస్తాహౌస్ యాజమాన్యం పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.
తమ రెస్టారెంట్ల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న కొంతమంది యూట్యూబర్లు, ఫుడ్ బ్లాగర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిస్తా హౌస్ ప్రతిష్టను దెబ్బతీసేలా కంటెంట్‌ను పోస్టులు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఛైర్మన్ మొహమ్మద్ అబ్దుల్ మజీద్. అందుకు సంబంధించి కొంత సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది.
కొన్నాళ్లుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లపై దాడులు చేస్తున్నారు. ఇదే క్రమంలో గతవారం గ్రేటర్ హైదరాబాద్ సిటీపరిధిలో 25 పిస్తా హౌస్ అవుట్ లెట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు. పిస్తా హౌస్ రెస్టారెంట్లలో తనిఖీలు చేసి 23 చోట్ల శాంపిల్స్ సేకరించారు.
ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని తేల్చారు. కిచెన్ పరిసరాల అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కిచెన్‌లో ఎలుకలు, బొద్ధింకలు, ఈగలు తిరుగుతున్నట్లు గుర్తించారు. నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ కలర్స్ వాడినట్టు తేలింది. అలాగే తుప్పు పట్టిన ఫ్రిడ్జ్‌లో నాన్‌వెజ్ స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు.
ALSO READ: శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏకంగా 67 మంది ప్రయాణికులు
కొన్ని ఆహార పదార్థాలు నేలపై ఉండడం, రికార్డులు లేకపోవడం వంటి సమస్యలు బయటపడ్డాయి. లోపాలను సరి చేయాలని నిర్వాహకులకు సూచన చేశారు. ఆనాటి నుంచి కొందరు యూట్యూబర్లు, ఫుడ్ బ్లాగర్లు పనిగట్టుకుని పదే పదే ప్రచారం చేయడం మొదలుపెట్టినట్టు పిస్తా హౌస్ యాజమాన్యం దృష్టికి వెళ్లింది. దీంతో కస్టమర్ల సంఖ్య అమాంతంగా పడిపోయింది.
పరిస్థితి గమనించిన పిస్తా హౌస్ ఛైర్మన్ మొహమ్మద్ అబ్దుల్ మజీద్.. సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ని కలిసి మొత్తమంతా వివరించారు. కొందరు యూట్యూబర్లు, బ్లాగర్లపై ఫిర్యాదు చేశారు. అయితే దాడులు జరిగిన రోజు సాయంత్రం పిస్టా హౌస్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అబ్దుల్ మజీద్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
తాము అందించే ప్రతి వస్తువులో నాణ్యత, పరిశుభ్రత, అత్యున్నత ప్రమాణాలను కాపాడటానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. పిస్తా హౌస్‌పై తనిఖీ నిజమేనన్నారు. అబద్ధ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొంతమంది యూట్యూబర్లు, ఫుడ్ బ్లాగర్లు నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
ఆహార శాఖ అధికారులు తనిఖీ చేశారని, వారు లేవనెత్తిన వాటిపై సరిదిద్దామన్నారు. కొంతమంది ఎలుకలు, బొద్దింకలు కనిపించాయని సోషల్‌మీడియాలో ప్రచారం చేశారని పేర్కొన్నారు. కొన్ని టీఆర్‌పీల కోసం కొంతమంది యూట్యూబర్లు, ఛానెల్‌లు మూడు దశాబ్దాల తమ బ్రాండ్ ప్రతిష్టను దిగజార్చుతున్నాయని అన్నారు. వారిపై తాము పరువు నష్టం కేసు పెట్టామని తెలిపారు.
Official Statement from Mr. Mohammed Abdul Majeed – Founder of Pista House
We remain committed to upholding the highest standards of quality, hygiene, and transparency in every product we serve.
A heartfelt thank you to our loyal customers and friends for standing with us and… pic.twitter.com/wfRYYOlpqO
— Pista House (@pistahousehyd) August 14, 2025