– గురువారం కళ్లను తీర్చిదిద్దిన శిల్పి
– ముఖ్యమంత్రిని ఆహ్వానించిన కమిటీ
– చవితి నాడు తొలిపూజ.. 17న నిమజ్జనం
– 40 లక్షల మందికి దర్శిస్తారని అంచనా
Ganesh Chaturthi: భాగ్యనగంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో ఈసారి ఖైరతాబాద్ ఏకదంతుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇప్పటికే గణపయ్య విగ్రహపు పనులు పూర్తి కాగా, గురువారం శిల్పి రాజేందర్ గణనాథుడి కళ్లను తీర్చిదిద్దారు. ఈ నెల 7 నుంచి నవరాత్రి పూజలు అందుకోనున్న ఖైరతాబాద్ గణపయ్య సెప్టెంబర్ 17న జరిగే నిమజ్జన కార్యక్రమంతో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కాగా, గురువారం ఖైరతాబాద్ శాసన సభ్యుడు దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినాయక నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.
ఈసారి ప్రత్యేకతలు..
ఖైరతాబాద్‌లో 1954లో తొలిసారి గణేశ్ నవరాత్రులు మొదలయ్యాయి. ఈ ఏడాదికి వేడుకలు ప్రారంభమై 70 సంవత్సరాలు పూర్తి కానున్నందున ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతి రూపాన్ని ప్రతిష్టించనున్నారు. నిజానికి, గతంలోనూ సప్తముఖ గణపతి రూపంలో ఇక్కడ వినాయకుడిని నిలిపిన సందర్భాలున్నప్పటికీ, అప్పటి రూపానికి భిన్నంగా ఈసారి స్వామి కనిపించనున్నాడు. 7 తలలు, 14 చేతులు, తలలపై నాగసర్పాలతో కూడిన పీఠం మీద 70 అడుగుల ఎత్తుతో స్వామి ఈసారి భక్తులకు దర్శనమివ్వనున్నారు. గణనాథుడికి కుడి వైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివ పార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాల రాముడి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. నిరుడు 63 అడుగుల ఎత్తున దర్శనమిచ్చిన స్వామివారిని 35 లక్షలమంది దర్శించుకోగా, ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
Also Read: AP Deputy CM: పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్.. కీలక ఆదేశాలు
తొలిపూజకు.. గవర్నర్
ఖైరతాబాద్‌లోని శ్రీ సప్త ముఖ మహా శక్తి గణపతి పూజకు హాజరు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఖైరతాబాద్గణేశ్ఉత్సవ అడహాక్ కమిటీ ఆహ్వానం పలికింది. బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన కమిటీ ఛైర్మన్, సభ్యులు, ఖైరతాబాద్ఎమ్మెల్యే దానం నాగేందర్ బృందం గవర్నర్‌కు ఆహ్వాన పత్రిక అందజేసింది.