Khairatabad Ganesh: గణేశ్ చతుర్థి సంబరాలకు ఇంకో రెండు రోజులే మిగిలి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల భక్తులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూసే ఖైరతాబాద్ మహా గణపతి ఈసారి ఒక కొత్త రూపంతో ప్రజల ముందుకు రానున్నారు. ఈ ఏడాది విగ్రహానికి పెట్టిన పేరు విశ్వశాంతి మహాశక్తి గణపతి. ప్రస్తుతం రంగులు వేసే పనులు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ పర్యవేక్షణలో వేగంగా జరుగుతున్నాయి. రాత్రింబగళ్లు శ్రమిస్తున్న కళాకారుల కష్టంతో రూపొందిన ఈ గణపతి రూపం భక్తులను మైమరిచేలా అందంగా తీర్చిదిద్దుతున్నారు.
విగ్రహ అద్భుతం
ఈ మహాగణపతి విగ్రహం 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో కళ్లకు కట్టినట్టుగా అలరించబోతుంది. మొత్తం 84 రోజులు పాటు, 125 మంది కళాకారులు కష్టపడి ఈ మహత్తర విగ్రహాన్ని తయారు చేశారు. ఎత్తు, వెడల్పు మాత్రమే కాదు ఆ విగ్రహంలోని శిల్పకళ, రంగుల అందం చూసినవారికి ఒక దివ్యానుభూతి కలుగుతుంది.
గణపతి రూప విశేషాలు
ఈసారి గణపయ్య శాంతమూర్తి స్వరూపంలో దర్శనమిస్తారు. ఆయనకు ఇరువైపులా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉండగా, ఎడమ వైపు జగన్నాథుడు, సుభద్ర, బలరాం విగ్రహాలు ఉంటాయి. కుడివైపు లక్ష్మీదేవి, హయగ్రీవ స్వామి దర్శనమిస్తారు. మండపంలో కూడా ప్రత్యేకంగా కన్యాకా పరమేశ్వరి, గజ్జెలమ్మ విగ్రహాలు ఆకట్టుకుంటాయి. మండపంలోని ప్రతి విగ్రహం, ప్రతి కోణంలో ఉన్న ప్రతిమలు భక్తులలో భక్తి భావాన్ని పెంచుతూ, ప్రతి దిశలో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.
Also Read: CISF Women Commando: పురుషుల ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్…. మహిళా కమాండోలు ఎంట్రీ!
గణనాథ మూర్తికి ఉపయోగించిన పదార్థాలు
ఈ మహా విగ్రహం నిర్మాణానికి 30 టన్నుల ఇనుము, గుజరాత్ నుంచి తెప్పించిన 1,000 మట్టి బస్తాలు, 70 బస్తాల రైస్ హస్క్ (వరి గింజల బయట ఉన్న పొరలు), 50 బండ్ల వరి వంటి పదార్థాలు ఉపయోగించారు. ఒక విగ్రహం వెనుక ఎంతటి కృషి, విశ్వాసం దాగి ఉందో ఈ సంఖ్యలే చెబుతున్నాయి.
ఉత్సవ మహోత్సవం
ఇప్పటికే ఖైరతాబాద్ ప్రాంతం గణనాథుని దర్శించేందుకు వచ్చే భక్తులతో కిక్కిరిసి పోతోంది. సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ గణపయ్య చుట్టూ పండగ వాతావరణం నెలకొంది. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం అయిన మహా గణపతి నిమజ్జనం మాత్రం సెప్టెంబర్ 6, 2025న జరగనుంది. హుస్సేన్ సాగర్‌లో ఈ మహాగణపతి తన చివరి యాత్ర పూర్తి చేయనున్నారు.
ప్రతి సంవత్సరం భక్తులకు కొత్త సందేశం ఇస్తూ, కొత్త రూపంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతి ఈసారి విశ్వశాంతి, మహాశక్తికి ప్రతీకగా నిలుస్తున్నారు. ఈ విగ్రహాన్ని దర్శించుకోవడం భక్తుల కోసం కేవలం పండగ ఆనందం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి కూడా అవుతుంది.