CISF Women Commando: భారత భద్రతా రంగంలో ఇది నిజంగా ఒక విప్లవాత్మక నిర్ణయం. ఇప్పటివరకు సైన్యం, భద్రతా దళాలు, ప్రత్యేక బృందాలు అన్నీ ఎక్కువగా పురుషుల ఆధిపత్యంలో ఉన్నా ఇప్పుడు అదే మార్గంలో మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) తొలిసారి పూర్తి మహిళలతో కూడిన కమాండో యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది కేవలం ఒక శిక్షణ కాదు దేశ రక్షణలో మహిళల కొత్త అధ్యాయం అనే చెప్పాలి.
ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని బర్వాహాలోని రీజినల్ ట్రైనింగ్ సెంటర్‌లో 30 మంది మహిళా సిబ్బంది ఎనిమిది వారాల పాటు అత్యంత కఠినమైన కమాండో శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ ఒకటే కాదు, శారీరక శక్తి, నైపుణ్యాలు, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికే అన్ని రకాలు కలిపి ఇచ్చే కోర్సులు కూడా ఉన్నాయి. అంటే వీరు కేవలం భద్రత కాపాడే వాళ్లు మాత్రమే కాకుండా, ఏ కఠిన పరిస్థితిలోనైనా ముందుండి పోరాడగల యోధులుగా తీర్చిదిద్దుతున్నారు.
Also Read: Wife beats husband: భర్తను చితక్కొట్టిన భార్య.. ఏడుస్తూ పోలీసులకు ఆశ్రయించిన భర్త
ఈ శిక్షణ తర్వాత ఈ మహిళా కమాండోలు కేవలం గార్డింగ్‌లోనే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం, ఉగ్రదాడులను అడ్డుకోవడం వంటి బాధ్యతలు తీసుకుంటారు. వీరి ప్రధాన కర్తవ్యమేమిటంటే దేశంలోని కీలక కేంద్రాలు, ముఖ్యంగా విమానాశ్రయాలు, ప్రధాన సంస్థలను రక్షించడం. ఈ మొదటి 100 మంది మహిళా కమాండోలు దేశవ్యాప్తంగా మహిళా కమాండో వ్యవస్థకు మార్గదర్శకులుగా నిలవబోతున్నారు
ప్రస్తుతం CISF దళంలో సుమారు 8% మంది మహిళలు ఉన్నారు. అంటే దాదాపు 12,491 మంది మహిళలు ఇప్పటికే సేవ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఈ శాతం 10కి పెరగాలి. దీని కోసం రాబోయే 2026లో మరో 2,400 మంది మహిళలను నియమించడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది.
ఇదే సమయంలో ఢిల్లీలో దేశంలోని తొలి పూర్తి మహిళా బెటాలియన్‌ను కూడా ఏర్పాటు చేయడానికి గృహ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బెటాలియన్‌కి పార్లమెంట్ భవనం, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ మెట్రో, అలాగే ఇతర కీలక ప్రభుత్వ సంస్థల రక్షణ బాధ్యతలు అప్పగించబడనున్నాయి. అంటే ఇక భద్రతా రంగంలో మహిళలు కేవలం సహాయక పాత్రలో ఉండే రోజులు ముగిశాయి. ఇప్పుడు వారు ముందుండి దేశాన్ని రక్షించే కమాండోలుగా మారబోతున్నారు. ఇది కేవలం ఒక శిక్షణ కాదు, దేశవ్యాప్తంగా మహిళా శక్తి స్థాయిని చూపించే గర్వకారణం. రేపటి రోజుల్లో ఎక్కడైనా CISF మహిళా కమాండోలు నిలబడితే అది ప్రతి భారతీయుడికి గర్వకారణమే.