Kamareddy floods: కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలు పరిస్థితిని మరింత కష్టంగా మార్చాయి. ముఖ్యంగా పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. వరద నీరు కాలనీలోకి ఉధృతంగా చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన కామారెడ్డి పట్టణ పోలీసులు తక్షణమే స్పందించి సుమారు 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలీసుల వేగవంతమైన చర్యకు స్థానికులు అభినందనలు తెలియజేశారు.
జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రోడ్లు, చెరువులు, వాగులు ఉధృతంగా పొంగిపొర్లేలా చేశాయి. ముఖ్యంగా నర్వ, అన్నాసాగర్ గ్రామాల మధ్యనున్న రహదారి వరద నీటితో మునిగిపోయింది. ఈ సమయంలో రహదారిపై ప్రయాణిస్తున్న 7 మంది వరద నీటిలో చిక్కుకుని ప్రాణభయంతో సహాయం కోసం అర్తనాదాలు చేశారు. ఈ సమాచారాన్ని అందుకున్న జిల్లా ఎస్పీ శ్రీ వై. రాజేశ్ చంద్ర, IPS స్వయంగా అక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు.
ఎస్పీ గారు SDRF, ఫైర్ సర్వీస్ బృందాలకు తక్షణమే ఆపరేషన్ ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేశారు. కొద్ది సమయంలోనే సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టి చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రక్షణ చర్యల సమయంలో ఎస్పీ స్వయంగా ఫోన్‌లో బాధితులతో మాట్లాడి ధైర్యం చెబుతూ వారికి మానసిక ధైర్యాన్ని కలిగించారు.
అన్నాసాగర్ గ్రామంలో వరదలో చిక్కుకున్న 9 మందిని SDRF రిస్క్యూ టీం మరియు ఫైర్ టీం సహకారంతో సురక్షితంగా రక్షించామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పోలీసులు, SDRF, ఫైర్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించారని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణం కాలేదు. పలు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో అధికారులు రాత్రింబవళ్ళు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు తగ్గే వరకు అక్కడి ప్రజలను సురక్షిత ప్రదేశాల్లో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు.
కామారెడ్డి పట్టణంలో పలు రోడ్లు దెబ్బతినడంతో రవాణా అంతరాయం కలిగింది. పలు గ్రామాలకు రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాహనాలను కదిలించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం వర్షాలు కొనసాగుతుండటంతో వాతావరణ శాఖ కూడా అప్రమత్తం చేస్తోంది. రాబోయే 48 గంటలపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనితో అధికారులు అన్ని రకాల సహాయక చర్యలను సిద్ధం చేసుకున్నారు. జిల్లా పోలీస్ బృందం, రెవెన్యూ శాఖ, విపత్తు నిర్వహణ విభాగం, SDRF, NDRF బృందాలు కలసి సహాయక చర్యలను సమన్వయంతో నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం.
Also Read: Flood Alert Telangana: 10 గంటల్లో 300 మి.మీ. వర్షం.. మెదక్, సిద్దిపేట, కామారెడ్డిలో పరిస్థితి భయానకం
మంత్రి సీతక్క అత్యవసర సమీక్ష
జిల్లాలో పెరుగుతున్న వరద పరిస్థితుల దృష్ట్యా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు సంబంధిత అన్ని విభాగాల అధికారులతో జరిగిన ఈ సమీక్షలో ఆమె పలు కీలక సూచనలు చేశారు. ప్రతి గ్రామం, పట్టణంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలించాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాకపోకలను అనుమతించవద్దని, ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అలాగే, రక్షణ చర్యల్లో ఎక్కడా నిర్లక్ష్యం చోటుచేసుకోరాదని, ప్రతి అధికారి తమ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించాల్సిన అవసరం ఉందని సీతక్క స్పష్టం చేశారు. వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహాయాన్ని వేగంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు అధికారుల సూచనలను పాటించి సురక్షితంగా ఉండాలని, వరద నీరు ఉన్న ప్రాంతాల్లో అనవసరంగా తిరగకూడదని మంత్రి విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతతో సహాయక చర్యలను కొనసాగిస్తోంది.