Flood Alert Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారింది. గత 10 గంటల్లోనే, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో 300 మి.మీ.లకు పైగా వర్షం కురిసింది. ఈ పరిస్థితిని, అధికారులు జిల్లాలకు వరద హెచ్చరిక జారీ చేశారు.
జాగ్రత్తగా ఉండండి.. సురక్షిత ప్రదేశాలకు చేరుకోండి
ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ఎక్కడికి వెళ్ళకూడదని, అత్యవసర పరిస్థితుల కోసం అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు. అలాగే, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి, ములుగు జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు, ముఖ్యంగా బయటకు వెళ్ళే వారు, జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: Mahindra BE 6: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహీంద్రా BE6.. 135 సెకన్లలో కార్లన్నీ సేల్
వర్షాలు కొన్నిరోజులు కొనసాగే అవకాశం
హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి. తడిగా ఉన్న రోడ్లపై, గల్లీలలో అప్రమత్తత లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశముంది. ప్రత్యేకంగా ఎక్కువగా నీరు నిలువ ఉండే ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు. ఈ వర్షాలు కొన్నిరోజులు కొనసాగే అవకాశముంది కాబట్టి, ప్రజలు ముందస్తుగా ప్రమాద స్థలాల నుండి దూరంగా ఉండటం అత్యవసర ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని వెల్లడించారు. ప్రభుత్వ సూచనలను గమనిస్తూ, కుటుంబాలు సురక్షితంగా ఉండటం అత్యంత ముఖ్యమని అధికారులు సూచిస్తున్నారు.
వానకు లెక్కచేయకుండా ఖైరతాబాద్‌కు భక్తులు
ఇక ఖైరతాబాద్‌లో గణేశున్ని దర్శించుకోడానికి భక్తులు తరలి వస్తున్నారు. వర్షాన్ని కూడా లెక్కచేయడ కుండా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం వల్ల ట్రాఫిక్ అంతరాయం రాకుండా, అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని, చిన్న పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని కూడా సూచించారు. భక్తులు జాగ్రత్తగా, సురక్షితంగా దర్శనం చేసుకోవడం ముఖ్యమని అధికారులు హెచ్చరిస్తున్నారు.