Khelo India Youth Games 2026: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 8వ ఎడిషన్ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ పోటీలకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, శాశ్వత ప్రాతిపదికన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఎం సీ ఆర్ హెచ్ ఆర్ డీ లో ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ సన్నాహకాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వనరులను, ఖేలో ఇండియా పోటీల ఏర్పాట్లకు సైతం సమాంతరంగా ఉపయోగించుకోవాలని సూచించారు. క్రీడల్లో పెట్టుబడుల ఆకర్షణ కూడా గ్లోబల్ సమ్మిట్‌లో భాగమైనందున అధికారులు ఉమ్మడిగా కృషి చేయాలన్నారు. క్రీడలు పూర్తయిన తర్వాత కూడా ఈ మైదానాలు మరియు మౌలిక వసతులు రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించే గొప్ప క్రీడా వనరులుగా ఉపయోగపడాలని స్పష్టం చేశారు.
వారం వారం రిపోర్ట్ ఇవ్వాల్సిందే!
ఇక క్రీడా ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాల లోపం లేకుండా గ్రూప్-1 స్థాయి అధికారులకు ప్రారంభం నుండి ముగింపు వరకు పర్యవేక్షణా బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. జిల్లాల్లో జరిగే పోటీల పర్యవేక్షణకు స్థానిక ట్రైనీ ఐఏఎస్, గ్రూప్-1 అధికారులను నియమించాలని ఆదేశించారు. ఆహారం, వసతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని,దేశం నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులకు ఆహారం, వసతి సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, వారానికోసారి ఏర్పాట్ల పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఖేలో ఇండియాలో మన కర్రసాము..
ఆతిథ్య రాష్ట్ర కోటా కింద తెలంగాణ సాంప్రదాయ క్రీడ అయిన ‘కర్రసాము’ను ఖేలో ఇండియాలో డెమో క్రీడగా చేర్చేందుకు వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. ప్రచార ఆడంబరాలకు తావులేకుండా, క్రీడాకారుల సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశేష సంఖ్యలో క్రీడాకారుల రాక డిసెంబర్ 11 నుండి జరిగే ఈ పోటీల్లో 27 రకాల క్రీడలు, ఒక డెమో పోటీ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 6 నగరాల్లోని 20 వేదికలలో ఈ పోటీలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 7వేలకు మందికి పైగా యువ క్రీడాకారులు, దాదాపు 2 వేలకు మంది కోచింగ్ సిబ్బంది, అధికారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణకు రానున్నారు.తెలంగాణ క్రీడా విధానం, ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’ స్థాపన ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ హబ్‌గా మార్చడమే కాకుండా, భవిష్యత్తు ఒలింపిక్స్ పతకాలే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం పునరుద్ఘాటించారు.ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (స్పోర్ట్స్) వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలా దేవి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. ఈసారైనా వెళ్తారా? గుండె నొప్పి సాకుతో తప్పించుకుంటారా?