Baobab Tree @ 440 Yrs : హైదరాబాద్ చూసేందుకు వచ్చే పర్యాటకులు, నగరవాసులు తప్పకుండా చూసే ప్రదేశాల్లో గోల్కొండ కోట ఒకటి. అక్కడ అద్భుతమైన కోటగోడల్ని అందరూ చూస్తారు.. కానీ అక్కడే ఉన్న మరో వింతను చాలా మంది మిస్ అవుతుంటారు. అందేంటంటే.. మన గోల్కొండ కోటలో ఆసియాలో అతిపెద్ద బాబాబ్ చెట్టు ఉంది. అతిపెద్దదే కాదు.. అతి పురాతనమైనది కూడా. అంటే ఎన్నాళు అనేగా మీ సందేహం.. మీరంతా ఆశ్చర్యపోయేలా.. దాదాపు 440 ఏళ్ల క్రితం నాడిదీ చెట్టు. అవును.. గోల్కొండ గోట ఉద్ధాన, పతనాలన్నింటినీ ఈ చెట్టు చూసిందనే చెప్పొచ్చు. అక్కడ రాజులు, రాణులు తిరుగాడినప్పటి నుంచి అక్కడే ఉన్న చెట్టు.. ఇప్పుడు ఓ పర్యాటక ప్రాంతంగా మనం వెళ్లి తిరుగుతున్నా.. అలాగే చూస్తుంటుంది. చాలా మంది అసలు ఇక్కడ ఓ పురాతన చెట్టు ఉందని గుర్తించరు. ఎవరైనా చూసినా.. దీని ప్రత్యేకత తెలియదు. మరీ.. ఇప్పటికైన.. ఈ చెట్టు విశిష్టత ఏంటో తెలుసుకుందామా..
గోల్కొండ ఖిలా దగ్గర భారీగా, ఆకాశాన్ని తాకుతుండేలా ఉన్న చెట్టు మన దేశానికి చెందినది కాదు. అది ఆఫ్రికాకు చెందిన ప్రత్యేక జాతి చెట్టు. దీనిని మనం ఎక్కడ పడితే అక్కడ చూడలేం. కేవలం కొన్ని నిర్థిష్ట ప్రాంతాల్లోనే చూడగలం. వాటిలో మన గోల్కొండ కోట ఒకటి. ఎన్నో చారిత్రక ప్రత్యేకతలు, జీవావరణ ప్రత్యేకతలున్న ఈ చెట్టుకు.. స్థానికుల నుంచి తీవ్ర నష్టం జరిగింది. దీని కొమ్మల్ని తెంపడం, బెరడుపై రాళ్లు, మేకులతో గీతలు పెట్టడం సహా అనేక రకాలుగా దానికి నష్టం కలిగిస్తున్నారంటూ అనేక ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. దాంతో.. పర్యావరణ కార్యకర్తలతో చొరవతో ఈ చెట్టును దాదాపు పదేళ్ల క్రితం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) దీనిని ‘రక్షిత స్మారక చిహ్నం’గా ప్రకటించింది.
బాబాబ్ చెట్టు మూలం ఎక్కడ?
నయా ఖిలాలోని పురాతనమైన 440 ఏళ్లనాటి ఆఫ్రికన్ బాబాబ్ చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. అత్యంత భారీగా భారతీయ చెట్లకు భిన్నంగా ఉంటే ఈ చెట్టుకు మన భరత ఖండానికి కూడా సంబంధం లేదంటారు శాస్త్రవేత్తలు. దీని కాండమే దాదాపు 75 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉంటుందంటే.. ఇది ఎంత ప్రత్యేకమైందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. దీని జాతులు, పుట్టుకలు, కఠిన వాతావరణ పరిస్థితుల్లో పెరిగే గుణం కారణంగా.. ఈ చెట్టు మడగాస్కర్ దేశానికి చెందినదిగా చెబుతుంటారు. శతాబ్దాల క్రితం గోల్కొండ కోటకు వచ్చే ఆ దేశానికి చెందిన సన్యాసులు, పర్యాటకులు లేదా వర్తకులు ఎవరైనా తెచ్చి నాటి ఉంటారని భావిస్తున్నారు. ఈ విత్తనాల్ని మడగాస్కర్ నుంచి తీసుకొచ్చి నాటి ఉంటారని చాలా మంది అభిప్రాయ పడుతుంటారు. మరికొందరేమో.. దీనిని కుతుబ్ షాహి రాజుల కోసం పనిచేసిన ఆఫ్రికన్లు ఇక్కడికి తీసుకువచ్చారని గట్టిగా చెబుతుంటారు.
ది ఎలిఫెంట్ ట్రీ
మన దగ్గరున్న ఈ బాబాబ్ చెట్టు.. దాని వాస్తవ జాతులకు ఆవాసమైన ఆఫ్రికా, ఆస్ట్రేలియా వెలుపల ఉన్న అతిపెద్ద బాబాబ్ లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ భారీ చెట్టును ‘హతీయన్ కా ఝాడ్ లేదా ఎనుగు చెట్టు అని పిలుస్తారు. ఎందుకంటే దీని కాండం.. ఏనుగు పాదాన్ని పోలి ఉంటుంది. ఈ భారీ చెట్టును చాలా మంది గమనించకుండానే గోల్కొండ కోటను చుట్టేసి వస్తుంటారు. ఇది ఎన్నో తరాలకు వారథిగా.. మన ముందు తరాల నాటి చరిత్రకు గుర్తుగా ఇక్కడ ఉందంటారు చరిత్రకారులు. ఆరోజుల్లో జరిగిన వర్తక, వాణిజ్యమో.. మరోదే కారణంగానే అంత సుదూరం నుంచి ఇక్కడకు.. వేల మైళ్లు దాటి ఓ చెట్టు ప్రత్యేకంగా ఇక్కడ నిలిచిందని చెబుతుంటారు. ప్రస్తుతం.. గోల్కొండ ఖిలాలోని బాబాబ్ చెట్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సంరక్షణలో ఉంది.
అయితే.. ఆఫ్రికా, ఆస్ట్రేలియా వెలుపల అతిపెద్ద బాబాబ్ గా గుర్తింపు పొందిన ఈ చెట్టు.. వాతావరణ మార్పులు, 500 సంవత్సరాల పురాతన కోట సముదాయంలో పెరిగిన మానవ కార్యకలాపాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందని అంటున్నారు. కుతుబ్ షాహి ఆస్థాన కవి గౌరవార్థం నిర్మించిన అందమైన ముల్లా ఖయాలీ మసీదు సమీపంలోనే ఈ చెట్టు ఉంది.
ఇతిహాసాలు, కథలు
ఈ చెట్టుతో ముడిపడి స్థానికంగా అనేక జానపద కథలు, స్థానిక కథలు అల్లుకుని ఉన్నాయి. హైదరాబాద్ మూసీ నదికి వరదల ముంచెత్తిన సమయంలో.. ఈ చెట్టు వందలాది మందికి ఆశ్రయం కల్పించిందని చెబుతుంటారు. అలాగే.. పే..ద్ద గా ఉండే దీని కాండం లోపల బోలుగా ఉంటుంది. లోపల మనుషులు సులువుగా వెళ్లేందుకు వీలుంటుంది. ఇదే.. అప్పుడు దొంగలకు ఆవాసంగా మారేదని చెబుతుంటారు. ఒకప్పుడు దీని బోలు కాండంలో దాక్కుని, రాత్రిపూట మాత్రమే ఒక డజలు దొంగలు ఉండే వారని ఈ చుట్టు పక్కల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
బాబాబ్ రకాలు
ఈ జాతికి చెందిన చెట్టు ప్రపంచంలో ఎనిమిది రకాలు మాత్రమే ఉన్నాయి. ఆరు హిందూ మహాసముద్రంలోని ఒక ద్వీపమైన మడగాస్కర్ లో, ఇంకోటి ఆఫ్రికాలో, మరొకటి ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తాయని వృక్ష శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ప్రస్తుతం గోల్కొండలో పెరిగే బాబాబ్ చెట్టు మడగాస్కర్ దేశానికి చెందిన ఆఫ్రికన్ రకం బాబాబ్ గా చెబుతున్నారు. దీని పరిమాణం, జీవిత కాలం, కాయలు, బెరడు కారణంగానే చాలా ప్రత్యేకమైందిగా చెబుతుంటారు. అలాగే.. ఇది నిరంతరం తన కాండాలని విస్తరిస్తుంటుంది. ఈ కాండాల మధ్య ఖాళీలో బెరడు పునరుత్పత్తి చెందుతుంది.
Also Read :