Komatireddy Venkat: కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా ఇవ్వడమే కాదు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఆ కుటుంబంలో ఆనందం నింపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న నిరుపేద కుటుంబానికి.. కష్టకాలంలో అండగా నిలిచి మానవత్వం చూపించారు. మూగ, చెవిటి దంపతులకు చెందిన చిన్నారికి.. మెరుగైన వైద్యం అందేలా స్వయంగా చొరవ తీసుకున్నారు. సాయం కోసం ఆశ్రయించిన ఆ కటుంబానికి తక్షణసాయం చేశారు.
మూగ, చెవిటి చిన్నారికి ఆపరేషన్, చదువు బాధ్యత..
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పనిగిరి గ్రామానికి చెందిన జంపాల మహేష్‌కుమార్, రజిత దంపతులు.. వినికిడి, మాటల సమస్యలతో బాధపడుతున్నారు. వారికి జన్మించిన బిడ్డ కూడా అదే సమస్యతో పుట్టడంతో.. ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చిన్నారికి సరైన వైద్యం అందిస్తే.. మాట్లాడే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పడంతో వారిలో ఆశలు చిగురించాయ్. అయితే, చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని తెలియడంతో.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ దంపతులు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఆశ్రయించారు. వారి బాధ, ఆవేదనను అర్థం చేసుకున్న మంత్రి.. వెంటనే 2 లక్షల తక్షణ ఆర్థికసాయం అందించారు. అంతటితో ఆగకుండా, చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు.. డాక్టర్లతో స్వయంగా మాట్లాడారు. చిన్నారికి అవసరమైన చికిత్స చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. మంత్రి కోమటిరెడ్డి చొరవ తీసుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో.. చిన్నారికి ఆపరేషన్ చేయించారు. చికిత్స తర్వాత ఆస్పత్రికి వెళ్లి చిన్నారిని ఆప్యాయంగా పలకరించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. మరో 2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. అంతేకాదు.. ఆ చిన్నారి చదువు బాధ్యతలు కూడా తానే తీసుకున్నారు మంత్రి వెంకట్ రెడ్డి.
ఆపద్భాంధవుడిగా మంత్రి కోమటిరెడ్డి..
స్పీచ్ థెరపీ పూర్తి చేస్తే.. రాబోయే కొన్నిరోజుల్లోనే ఆ చిన్నారి మాట్లాడే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచి, బిడ్డకు చికిత్స చేయించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి.. ఆ నిరుపేద కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఆ చిన్నారి జీవితంలో వెలుగులు నింపడమే కాదు, ఆ బిడ్డ భవిష్యత్తుకు భరోసానిచ్చిన మంత్రి కోమటిరెడ్డి సేవలను అంతా కొనియాడుతున్నారు. ప్రజాసేవకు ఇదే నిజమైన అర్థమంటున్నారు.
Also Read: అమెరికాలో కాల్పుల కలకలం.. గర్భిణి, పిల్లలు సహా 9 మంది మృతి!