Village Politics: స్వేచ్ఛ బ్యూరో: దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీ ప్రస్తుతం రాజకీయ పోటీ, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు – ఈ మూడు అంశాల మేళవింపుతో గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది. గ్రామంలో అభివృద్ధి జరుగుతుందా లేదా అన్న దానికంటే, ఆ పనులకు క్రెడిట్ ఎవరు దక్కించుకుంటున్నారు అన్నదే ప్రధాన చర్చగా మారింది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకవైపు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని స్థానికులు సాక్షాలతో వివరిస్తుండగా, మరోవైపు బిఆర్ఎస్ నాయకులు కూడా వాటిలో తమ పాత్ర ఉందని ప్రస్తావించడంతో గ్రామస్తుల్లో అసలు అభివృద్ధి ఎవరి కృషితో జరుగుతోంది అన్న సందేహం నెలకొంది.
ఇదిలా ఉంటే, ఇందిరమ్మ ఇళ్ల పథకం మరోసారి చర్చనీయాంశమైంది. 2007 నుంచి 2014 మధ్య అమలైన ఈ పథకంలో కొంతమంది లబ్ధిదారులు ఇళ్లు పూర్తి చేయకుండానే బిల్లులు పొందినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో నిజమైన అర్హులు ఇప్పటికీ ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. “ఈసారి అయినా ఇల్లు వస్తుందా?” అనే ఆశతో ప్రభుత్వం వైపు చూస్తున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. ఒకసారి మంజూరు అయిన ఇల్లు మళ్లీ ఎందుకు అందడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుత ప్రభుత్వం గతంలో నిలిచిపోయిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపడుతుండగా, ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది.
Also Read: కేంద్ర ప్రభుత్వం పై.. ఎంపీ బలరాం నాయక్ సంచలన వ్యాఖ్యలు
ఈ రాజకీయ ఆరోపణల మధ్య అసలు ప్రజా సమస్యలు మాత్రం పరిష్కారం కాకుండా అలాగే నిలిచిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చొరవతో పంచాయతీ స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ, అమలులో స్పష్టమైన పురోగతి కనిపించడం లేదని వారు అంటున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో బాధ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ అర్హులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజాప్రతినిధులు రాజకీయాలకంటే గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. అధికారులు గతంలో జరిగిన అక్రమాలను విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
గ్రామ ప్రజలు తమ అవసరాలను స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు ఇళ్లు కావాలి, అభివృద్ధి పనులు పూర్తవాలి, రాజకీయాలకు అతీతంగా నిజమైన అభివృద్ధి కనిపించాలి. ప్రస్తుతం పరిస్థితి చూస్తే అభివృద్ధి కంటే రాజకీయ. ప్రచారం ఎక్కువ ప్రాధాన్యం పొందుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఇల్లు మంజూరైనప్పటికీ ఇప్పటికీ గృహం లేని లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే పోరాటానికి సిద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కొమ్ముగూడెం గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సింహం గుర్తుతో కవిత కొత్త పార్టీ.. ఇక గులాబీ బాస్‌కు చెక్ పెట్టినట్లేనా?..!